ప్రత్యేక ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – ‘పెళ్ళిచూపులు’ నా కెరీర్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది!

ప్రత్యేక ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – ‘పెళ్ళిచూపులు’ నా కెరీర్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది!

Published on Jul 31, 2016 6:52 PM IST

Vijay-Devarakonda
విజయ్ దేవరకొండ.. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’తో పరిచయమైన ఈ నటుడు, ఆ సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించగా, ఇప్పుడు తాజాగా ‘పెళ్ళిచూపులు’ అనే సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా, గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పెళ్ళిచూపులు సినిమాకు వస్తోన్న స్పందన గురించి హీరో విజయ్ దేవరకొండతో ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు..

ప్రశ్న) హలో విజయ్! పెళ్ళి చూపులుకి రెస్పాన్స్ ఎలా ఉంది?

స) రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు పనిచేసిన వారంతా యంగ్ టీమ్. ఈ స్థాయి రెస్పాన్స్ మేము కూడా ఊహించలేదు. నాకైతే విడుదలైనప్పట్నుంచే కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీ వారితో పాటు ఫ్రెండ్స్, ప్రేక్షకులూ అందరూ సినిమా గురించి బాగా మాట్లాడుతున్నారు.

ప్రశ్న) ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు మీకు అభినందనలు తెలిపారు?

స) ఇండస్ట్రీలో చాలా మంది ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నా ‘ఎవడే సుబ్రమణ్యం’ టీమ్ అయితే ఈ సక్సెస్ చూసి చాలా సంతోషించారు. నాని, దర్శకురాలు నందిని రెడ్డితో పాటు ఇంకా చాలామంది సినిమా బాగుందని మెచ్చుకున్నారు.

ప్రశ్న) మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? కథ వినగానే ఏమనిపించింది?

స) ఈ కథను తరుణ్ భాస్కర్ చాలామందికి వినిపించారట. ఎవడే సుబ్రమణ్యంలో నా నటన చూసి, ఈ కథకు నేనైతే బాగుంటానని నన్ను సంప్రదించారు. తరుణ్ గతంలో తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశా. ఈ కథ కూడా చాలా బాగా నచ్చింది. నటించేందుకు చాలా అవకాశం ఉన్న పాత్ర కావడంతో నేనూ వెంటనే ఓకే చెప్పేశా.

ప్రశ్న) ఈ సినిమా కోసం ముందస్తు ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? క్లైమాక్స్‌లో మీ నటన బాగుందని అందరూ అంటూంటే ఎలా అనిపిస్తోంది?

స) కథ వినగానే ఆ పాత్రను పూర్తిగా ఓన్ చేసుకున్నా. ఆ పాత్రలో ఏమేం మార్పులు చేయొచ్చో కూడా తరుణ్‌కు సూచించా. అతడూ ఆ మార్పులకు ఒప్పుకోవడంతో ఆ పాత్రకు ఓ స్పెషల్ ఐడెంటిటీ తేగలిగాం. ఈరోజు ఈ పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే అది ఈ ముందస్తు జాగ్రత్తల వల్లే. ఇక మీరన్నట్టు క్లైమాక్స్‌ని సింగిల్ టేక్‌లో తీయాలని తరుణ్ ముందే అనుకున్నారు. మేము షూట్ చేసిన చివరి సీన్ కూడా అదే. చాలాసార్లు రిహార్సల్ చేసి ఆ షాట్ చేశాం. ఇప్పుడది అందరూ మెచ్చుకుంటూంటే సంతోషంగా ఉంది.

ప్రశ్న) సరైన రిలీజ్‌కు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమాకు సురేష్ బాబు గారి రాక ఎలా సాయపడింది?

స) సురేష్ బాబు గారు లేకపోతే ఈ రోజు సినిమా ఇంత పెద్ద స్థాయిలో విడుదలయ్యేది కాదు. ఈ సినిమాను మేము మొదట్లో చాలామందికే వినిపించినా ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. సురేష్ బాబు గారు మాత్రం మాపై నమ్మకం ఉంచి సినిమాకు అండగా నిలబడడం కలిసి వచ్చింది. ఈ స్థాయి ప్రమోషన్‌కి కూడా ఆయనే కారణంగా చెప్పుకోవచ్చు.

ప్రశ్న) ఇప్పుడు ఈ సినిమాతో మీకు మంచి పేరొచ్చింది కదా.. భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?

స) ఈ సినిమా నిజంగానే నా కెరీర్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నాకు ఇలాంటి పాత్రలే చేయాలని ఎప్పుడూ లేదు. ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక దర్శకుడు ఒక పాత్ర అనుకున్నప్పుడు అందులో నేను ఫిట్ అవుతా అనుకున్నపుడు, మరొకరి పేరు గుర్తుకు రాకూడదు అనేలా నటించాలన్నదే నా కోరిక.

ప్రశ్న) కొత్తవారికి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎలా ఉంటుంది?

స) కొత్తవారికి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సులువు కాదండీ. నేనైతే కొన్ని నాకు నచ్చని పాత్రలు కూడా కేవలం ఇండస్ట్రీలో పరిచయాల కోసం చేస్తూండేవాడిని. ఇప్పుడు పెళ్ళిచూపులుతో కొంత పేరొచ్చింది. దాన్ని అలా నిలబెట్టుకునేలా పనిచేస్తా.

ప్రశ్న) తదుపరి సినిమాలు ఏంటి?

స) ప్రస్తుతానికి అర్జున్ రెడ్డి, ద్వారకా అనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండూ వేటికవే విభిన్నమైన సినిమాలు. నేను కోరుకుంటోన్న గుర్తింపు ఈ సినిమాలతో వస్తుందన్న నమ్మకం ఉంది.

ఇక అక్కడితో విజయ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ మా ఇంటర్వ్యూ ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు