రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న పూరి ‘రోగ్’ !

24th, March 2017 - 03:01:01 AM


దర్శకుడు పూరి జగన్నాథ్ చేసిన తాజా చిత్రం ‘రోగ్’. ఈ సినిమా ద్వారా ‘ఇషాన్’ను హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి. కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిన ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఇషాన్ స్టార్ హీరో అవడం ఖాయమని అంటున్నారు. దానికి తగ్గట్టే ఈ మధ్యే రిలీజైన ట్రైలర్, పాటలు కూడా ప్రేక్షకుల్ని బాగానే ఇంప్రెస్ చేశాయి. చిత్ర యూనిట్ కూడా ఎక్కువ శ్రద్ద పెట్టి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఆడియో వేడుకను బ్రహ్మాండంగా నిర్వహించి భారీ స్థాయి ప్రమోషన్లు కూడా చేపడుతున్నారు.

ఇకపోతే ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేయగా మార్చి 31ని విడుదల తేదీగా నిర్ణయించారు. పూరి మార్క్ సినిమా
కావడం, వేసవిలో వస్తుండటం, మంచి ప్రీ బజ్ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి విజయాన్ని సాయిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఇకపోతే సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి హీరోయిన్లుగా నటించగా అనూప్ ఠాకూర్ సింగ్ విలన్ పాత్ర పోషించాడు.