ఎట్టకేలకు అల్లరి నరేష్ వచ్చేస్తున్నాడు..!!

12th, December 2016 - 04:24:25 PM

intlodeyyam-nakem-bayam
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గత కొద్దికాలంగా ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్న నరేష్, ఈమధ్య కాలంలో మాత్రం ఎక్కడా మెప్పించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఆయన చేసిన కొత్త సినిమా ‘ఇంట్లో దయ్యం నాకేం భయం’ అనే సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్నా నెలరోజులుగా విడుదలకు నోచుకోవట్లేదు. మొదట నవంబర్ 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీమ్, భారత ప్రభుత్వ తీసుకున్న కరన్సీ బ్యాన్ ప్రభావంతో రిలీజ్ వాయిదా వేసుకుంది.

ఇక ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఏంటన్నది కూడా ప్రకటించలేదు. దీంతో సినిమా ఎప్పుడొస్తుందన్న సందిగ్ధంలో సినీ అభిమానులు పడిపోయారు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ డిసెంబర్ 30న తమ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నట్లు టీమ్ ప్రకటించేసింది. ఈ కొత్త విడుదల తేదీలో ఇక అస్సలు మార్పు ఉండదట. కామెడీకి తోడు ఈసారి హర్రర్ కూడా తోడవ్వడంతో నరేష్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాత బీవీఎస్‍ఎన్ ప్రసాద్ నిర్మించారు.