ఎట్టకేలకు ఎన్టీఆర్ కొత్త సినిమా ఖరారైంది!

ntr-kalyan-ram
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై బంపర్ హిట్ కొట్టిన ‘జనతా గ్యారేజ్‌’తో ఎన్టీఆర్ మళ్ళీ తన కెరీర్‌లో పూర్తి ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ఈ రేంజ్ హిట్ కొట్టాక ఆయన చేయబోయే కొత్త సినిమా ఏమై ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తుండగా, రెండు, మూడు నెలలుగా సరైన సమాధానం మాత్రం దొరకలేదు. ఇక ఈ గ్యాప్‌లో చాలా కథలు విన్న ఎన్టీఆర్, చివరకు దర్శకుడు బాబీకి అవకాశమిచ్చారు. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలను తెరకెక్కించిన బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు.

తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న #NTR27 సినిమాను నిర్మించనుండడం చాలా సంతోషంగా ఉందని, బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కళ్యాణ్ రామ్ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఓ కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నారట. ఆ లుక్ రాగానే, సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు.