చిట్ చాట్ : ధనుష్ – చిన్నపిల్లలకు ఆడుకోవడం ఎంతిష్టమో నాకు పనిచేయడం అంతే ఇష్టం !


‘రఘువరన్ బి.టెక్’ తెలుగులో పెద్ద హిట్టవ్వడంతో దీని సీక్వెల్ ‘విఐపి-2’ ను తమిళంతో పాటు తెలుగులో కూడా రూపొందించి ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన, దర్శకురాలు సౌందర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘రఘు వరుణ్ బి.టెక్’ హిట్టవడమే ‘విఐపి-2’ ను తెలుగులో కూడా చేయడానికి కారణమా ?
జ) అవును. ‘రఘు వరుణ్ బి.టెక్’ హిట్టవ్వడంతో దీన్ని తెలుగులో కూడా చేయడం కరెక్ట్ అనుకున్నాను. నటుడిగా నాకు ఇదే మొదటి తెలుగు సినిమా.

ప్ర) తెలుగు రిలీజ్ ఎందుకు ఆలస్యమైంది ?
జ) ముందుగా రెండింటినీ ఒకేసారి విడుదలచేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల తెలుగు ఆలస్యమైంది. ఇక తమిళంలో ఆ తమిళంలో ఆగష్టు 11 దాటితే మంచి రిలీజ్ డేట్ లేదు. అందుకే అక్కడ ముందుగా రిలీజ్ చేశాం. ఇక తెలుగులో ఈ నెల 25 అన్ని విధాలా మంచి తేదీ అని భావించి రిలీజ్ చేస్తున్నాం.

ప్ర) ‘విఐపి-2’ కి ‘రఘువరన్ బి.టెక్’ కు తేడా ఏంటి ?
జ) ఈ సినిమాలో హీరో పాత్ర, సెంటిమెంట్స్. కామెడీ, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ‘రఘువరన్’ లో ఉన్నట్టే ఉంటాయి. కాజల్ మేడమ్ పాత్రను నేను ఎలా ఎదుర్కొన్నాను అనేదే ఇందులో కొత్తగా కనిపించే పాయింట్.

ప్ర) ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయగానే సౌందర్యే డైరెక్టర్ అనుకున్నారా ?
జ) నేను ఈ స్క్రిప్ట్ రాయగానే సినిమాను ఎలా స్టార్ట్ చేయాలి అనే దానిపై అస్సలు క్లారిటీ లేదు. అదే టైమ్ లో ఈ చిత్ర నిర్మాత థానుగారికి ఒక సినిమా చేయాల్సి ఉంది. సౌందర్య ఆలోచనలు కూడా గ్రాండ్ గానే ఉంటాయి. అందుకే ఈ సినిమాకు ఆమే కరెక్ట్ అని నిర్ణయించాం.

ప్ర) సౌందర్యగారు మీరు చెప్పండి ధనుష్ గారు రాసిన స్క్రిప్ట్ మొదటిసారి చూడగానే మీకు నచ్చిందా ?
జ) ఫస్ట్ డ్రాఫ్ట్ చూడగానే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రఘువరన్ గురించి ఆయనకే బాగా తెలుసు. అందుకే ఆయన రాసిన కథ బాగా నచ్చింది.

ప్ర) సినిమాను తెలుగులో కూడా చేస్తామని కాజల్ గారికి ముందే చెప్పారా ?
జ) ఆమెకు అన్నీ తెలుసు. ఆమె కేవలం తమిళ సినిమా మాత్రమే చేయాలని అనుకోలేదు. హిందీ కానిది ఏదైనా చేయాలని అనుకున్నారు. కానీ హిందీ కాకుండా ఆమెకు వచ్చిన భాష తమిళ్ కాబట్టి అందులో చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావించారు. తెలుగులో చేయడం పట్ల ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదు.

ప్ర) రెండు భాషల్లో షూట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ?
జ) తమిళ్, తెలుగులో చేయడనికి 52 రోజులు పట్టింది. తెలుగు చేసేప్పుడు అందరూ తెలుగులో మాట్లాడితే కాజల్ మేడమ్ ఒక్కరే తమిళంలో మాట్లాడేవారు. ఒకవేళ ఆమె తెలుగులో మాట్లాడు ఉంటే ఇంకా ఎక్కువ సమయం పట్టేది.

ప్ర) సౌత్ ఇండస్ట్రీని, బాలీవుడ్ ని, హాలీవుడ్ ని వేరు చేసే అంశాలు ఏమిటి ?
జ) నేను ఎలా పని చేస్తున్నాను, సినిమా చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఎక్కడైనా తేడా చూపిస్తుంది. బాలీవుడ్ నుండి పర్ఫెక్షన్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాను. ఇది నా వ్యక్తిగత ఉద్దేశ్యం మాత్రమే.

ప్ర) మీరు చాలా రోజులుగా బిజీ బిజీగా ఉన్నారు కదా రిలాక్సేషన్ కోసం ఏం చేస్తారు ?
జ) నాకు పనిచేయడమే రిలాక్సేషన్. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాను. చిన్న పిల్లలకు ఆడుకోవడం ఎలాగో నాకు పనిచేయడం అలాగే. చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలని అనుకుంటాను.