4 కోట్ల అప్పుతో ప్రారంభమైన ‘అర్జురెడ్డి’ అద్భుత బిజినెస్ వివరాలు

టాలీవుడ్ చరిత్ర లోనే అర్జున్ రెడ్డి చిత్రం సరికొత్త సెన్సేషన్ గా మారిపోయింది. యువతకు కనెక్ట్ అయ్యే బోల్డ్ కంటెంట్ ఇందుకు కారణం. ఈ అంశమే అటు యూఎస్, ఇటు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లని ప్రవాహంలా పరుగులు పెట్టిస్తోంది. కాగా అర్జున్ రెడ్డి చిత్ర ప్రయాణం మాత్రం సాఫీగా మొదలు కాలేదు. నిర్మాత ప్రణయ్ వంగా అతని సోదరుడు, దర్శకుడు అయిన సందీప్ వంగ 4 కోట్ల లోన్ తీసుకుని మరీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దాదాపు రూ 5 కోట్ల బడ్జెట్ లో నిర్మించ బడింది.

ఈ చిత్ర ఏపీ మరియు తెలంగాణ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ కి అమ్మారు. సందీప్ మరియు ప్రణయ్ లు అతడి వద్ద నుంచి 4 కోట్ల అడ్వాన్స్ తీసుకుని వారి అప్పుని తీర్చేశారు. ఈ చిత్ర బిజినెస్ లో సునీల్ నారంగ్ 4 కోట్ల వరకు లాభాన్ని తీసుకుంటారు మిగిలిన లాభంలో 50 శాతం సందీప్, ప్రణయ్ లకు చెల్లించేలా ఒప్పందం జరిగింది. ఇలాంటి ఒప్పందమే ఓవర్సీస్ పంపిణీదారులతో కూడా జరిగింది. ఓవర్సీస్ పంపణీదారులు నిర్వాణ సినిమాస్ నుంచి ఈ సోదరులిద్దరూ 50 లక్షలు అడ్వాన్స్ ని తీసుకున్నారు. లాభాల్లో 50 – 50 షేర్ ని పంచుకుంటారు.

ఇంతటితో ఈ చిత్ర బిజినెస్ ఆగిపోలేదు. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీతెలుగు ఈ చిత్రానికి 3 కోట్ల శాటిలైట్ రైట్స్ ని ఆఫర్ చేసింది. ఈ డీల్ లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు తమిళ రీమేక్ హక్కుల రూపంలో 1.50 కోట్లు దక్కే అవకాశం ఉంది. అమేజాన్ ప్రైమ్ వీడియో అర్జున్ రెడ్డి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.1.60 కోట్లకు దక్కించుకుంది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ చిత్రం లాంగ్ రన్ లో దాదాపు 25 కోట్ల షేర్ ని రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం ద్వారా సందీప్, ప్రణయ్ లకు రూ 15 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం చాలా పెద్ద విషయం, ఘనత కూడా.