ఇంటర్వ్యూ : రాజశేఖర్ – నా కెరీర్లోనే బెస్ట్ సినిమా అయ్యే అర్హత ‘గరుడవేగ’ కు ఉంది

ఇంటర్వ్యూ : రాజశేఖర్ – నా కెరీర్లోనే బెస్ట్ సినిమా అయ్యే అర్హత ‘గరుడవేగ’ కు ఉంది

Published on Oct 31, 2017 4:04 PM IST

వరుస ఫ్లాపుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ చేసిన చిత్రం ‘పిఎస్వి గరుడవేగ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) రాజశేఖర్ గారు ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) నేను చేసిన అన్ని సినిమాల్లోకి బెస్ట్ సినిమా అయ్యే స్టామినా ఈ సినిమాకుంది. నా కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది.

ప్ర) కథ గురించి చెప్పండి ?
జ) ఇందులో నేను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో అధికారిగా కనిపిస్తాను. నాకో భార్య, కుటుంబం ఉంటాయి. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తి పరంగా నా జీవితం ఎలా ఉంటుందనేదే కథ.

ప్ర) పాత రాజశేఖర్ కి ఇందులో రాజశేఖర్ కి తేడా ఏంటి ?
జ) నా పాత సినిమాలన్నిటిలో నేను ఎమోషనల్ గానే కనిపించాను. కానీ ఇందులో మాత్రం చాలా సహజంగా నటించాను.

ప్ర) ఇంత భారీ బడ్జెట్ ఏ నమ్మకంతో పెట్టారు ?
జ) కథను నమ్మే ఈ సినిమా చేశాను. నిర్మాతలు కూడా కథను నమ్మే డబ్బులు పెట్టారు. మొదట్లో కేవలం 7, 8 కోట్లల్లో సినిమా చేసేయాలని అనుకుని మొదలుపెట్టాం కానీ నెమ్మదిగా బడ్జెట్ పెంచి గ్రాండియర్ గా తీశాం. ఈ రోజుల్లో సినిమా బాగుంటే డబ్బులు తప్పకుండా వస్తాయి.

ప్ర) మీ గత సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి ?
జ) ‘గడ్డం గ్యాంగ్’ తమిళ సినిమాకి రీమేక్. ‘మహంకాళి’ కూడా హిందీ సినిమాకు రీమేక్. వాటి ఒరిజినల్ వెర్షన్లు నచ్చి చేశాను. కానీ అవి నా ఇమేజ్ కు సరిపడకపోవడంతో ఫ్లాప్ అయ్యాయి.

ప్ర) ప్రవీణ్ సత్తారు పట్ల మీ అభిప్రాయం ?
జ) నేను పరాజయాల్లో ఉన్నప్పుడు చాలా మంది చిన్న క్యారెక్టర్లు, విలన్ పాత్రల కోసం నన్ను అడిగారు. హీరోగా అయితే కేవలం 3 కోట్ల వరకే బడ్జెట్ పెడతామని అనేవారు. అలాంటి పరిస్థితిలో ప్రవీణ్ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను నా దగ్గరకు తీసుకురావడం గొప్ప విషయం. ఆయనకు నా థ్యాంక్స్.

ప్ర) ప్రవీణ్ పనితనం ఎలా ఉంది ?
జ) ప్రవీణ్ మొదట వచ్చేటప్పుడే బౌండ్ స్క్రిప్ట్ తో నా దగ్గరకు వచ్చాడు. మొదటి సిట్టింగ్ లోనే నచ్చేసింది. ప్రవీణ్ కూడా స్క్రిప్ట్ లో ఏముందో స్క్రీన్ మీద కూడా అదే కనిపిస్తుందని చెప్పాడు. కానీ అంత పెద్ద సినిమాను అతడు చేయగలడా అనుకున్నాను. కానీ మొదటి రోజు ఆయన పనిచేసే విధానం చూసి నమ్మకమొచ్చింది.

ప్ర) మీ తల్లిగారు చనిపోయాక చాలా డిప్రెషన్లోకి వెళ్లినట్టున్నారు ?
జ) అవును. అమ్మ మరణంతో నాకు జీవితమంటే ఏమిటో తెలిసొచ్చింది. ఆమె చనిపోయేటప్పుడు పక్కనే ఉన్నాను. ఈ సినిమా విజయాన్ని ఆమె స్వయంగా చూడాలని అనుకున్నాను. కానీ కుదరలేదు.

ప్ర) ఈ సినిమా అందరికీ పేరు తెస్తుందా ?
జ) అవును. తప్పకుండా తెస్తుంది. కానీ ఎవరికీ పేరొచ్చినా ఆ క్రెడిట్ అంతా ప్రవీణ్ సత్తారుకే దక్కుతుంది.

ప్ర) ఈ సినిమా తర్వాత మంచి సపోర్టింగ్ రోల్స్, ప్రతి నాయకుడి పాత్రలు వస్తే చేస్తారా ?
జ) తప్పకుండా చేస్తాను. పాత్రలో, కథలో దమ్ముంటే చేస్తాను. ఇక ‘ధృవ’ లో అరవిందస్వామి చేసిన తరహా నెగెటివ్ రోల్స్ వచ్చినా చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు