ఇంటర్వ్యూ : సంపత్ నంది – కథను నిజాయితీగా చెప్పాలని ‘గౌతమ్ నంద’ చేశాను !
Published on Jul 27, 2017 12:04 pm IST


‘బెంగాల్ టైగర్’ తర్వాత దర్శకుడు సంపత్ నంది గోపీచంద్ హీరోగా రూపొందించిన చిత్రం ‘గౌతమ్ నంద’. మొదటి నుండి మంచి అంచనాల్ని నింపుకున్న ఈ చిత్రం రేపే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఇది కూడా మీ గత సినిమాల్లాగే కమర్షియల్ ఎంటర్టైనరా ?
జ) కమర్షియల్ ఎంటర్టైనరే. కానీ కంటెంట్ బేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో బలమైన కథ ఉంటుంది. ఇందులో ఒక కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాను.

ప్ర) ఉన్నట్టుండి ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా ఎందుకు చేయాలనిపించింది ?
జ) అంటే నేను ఇంతకు ముందు చేసిన ‘రచ్చ, బెంగాల్ టైగర్’ సినిమాల్లో హీరోకి, అతని ఫ్లాష్ బ్యాక్ కి తోడు బలమైన కథ ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే ఈసారి కథ ప్రధానంగా ఉండే సినిమా తీయాలని ఇది చేశాను.

ప్ర) మరి రిజల్ట్ పట్ల టెంక్షన్ ఫీలవుతున్నారా ?
జ) ఇంతకూ ముందు చేసిన సినిమాలు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ కాబట్టి ఏదోలా ఆడేస్తుందిలే అనే ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఈ సినిమాకు కొంచెం టెంక్షన్ గా ఉంది. సినిమా ఖచ్చితంగా ఆడాలి, ఇది నాకు, నా టీమ్ కు కీలకమైన సినిమా.

ప్ర) సినిమాలో గోపీచంద్ డ్యూయెల్ క్యారెక్టర్ చేశారా ?
జ) లేదు. ఒకటే క్యారెక్టర్. కానీ అందులో రెండు వేరియేషన్స్ ఉంటాయి.

ప్ర) అసలు కథేమిటి ?
జ) ఘట్టమనేని గౌతమ్, గౌతమ్ నందాగా ఎలా మారాడు అనేదే కథ. అంటే ఒక డబ్బున్నవాడు మంచి మనిషిగా ఎలా మారాడు అనేది చూపిస్తాం.

ప్ర) ఘట్టమనేని అనే ఇంటి పేరు పెట్టడానికి కారణం ?
జ) అంటే ఘట్టమనేని అనే ఇంటి పేరుకి ఒక స్టేటస్ ఉంది. ఆ ఇంటి పేరుతో ఉన్న వాళ్లంతా సొసైటీలో గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు. అందుకే ఆ పేరు పెడితే హీరో పాత్రకు ఒక గుర్తింపు వస్తుందని పెట్టాను.

ప్ర) సినిమా ఔట్ ఫుట్ ఎలా వచ్చింది ?
జ) చాలా బాగా వచ్చింది. కథను పూర్తి చేశాక ఎంత తృప్తి కలిగిందో సినిమా పూర్తయ్యాక కూడా అంతే తృప్తి కలిగింది.

ప్ర) గోపీచంద్ కొత్త లుక్ కోసం ఎలా కష్టపడ్డారు ?
జ) కథ రాసుకునేప్పుడే హీరో ఇలా ఉండాలని అనుకుని కొన్ని స్కెచెస్ వేయించాను. వాటిని గోపీచంద్ కు చూపించి ట్రై చేయాలి అనగానే సరే అన్నారు. పవన్ కళ్యాణ్ గారి స్టైలిస్ట్ రాము దగ్గరికి వెళ్లి అన్ని స్టైల్స్ ట్రై చేసి చివరికి ఒకటి ఫైనల్ చేశాం.

ప్ర) మీ ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకుంటారు ?
జ) అలా ఏం లేదు. ఈ కథకు కావలి కాబట్టి ఉన్నారు. ఇందులో హన్సిక ఒక మామూలు సేల్స్ గర్ల్ లాంటి అమ్మాయిగా చేసింది. ఇక బాగా డబ్బు, యాటిట్యూడ్ ఉండే పాత్ర కోసం క్యాథరిన్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాను.

ప్ర) సినిమాకు ఓవర్ బడ్జెట్ అయిందనే వార్తలొస్తున్నాయి ?
జ) అదేం లేదు. స్టోరీ చెప్పేటప్పుడు ఎంతవుతుందని చెప్పానో అంతలోనే సినిమా పూర్తి చేశాను. ఎక్కడా ఓవర్ బడ్జెట్ కాలేదు.

ప్ర) ఇందులో అన్నీ రియల్ స్టంట్స్ అని విన్నాం. వాటి గురించి చెప్పండి ?
జ) అవును. ఇందులో అన్నీ రియల్ స్టంట్స్. గోపీచంద్ గారు కష్టపడి చేశారు. సర్ఫింగ్, స్కై డైవింగ్, ఎడారిలో బైక్ రైడింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. అన్నిటినీ అనుకున్నట్టు షూట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతానికి ఒక కథా రాస్తున్నాను. అది ఎవరికీ ఏంటి అనేది ఇంకా అనుకోలేదు. ఇంకా నా ప్రొడక్షన్లో ‘పేపర్ బాయ్’ జరుగుతోంది. జయ శంకర్ దానికి డైరెక్టర్.

 
Like us on Facebook