
గోపీచంద్ హీరోగా రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ సినిమాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం ‘జిల్’. మార్చి 27న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందనే వస్తోంది. బాక్సాఫీస్ పరంగానూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
సినిమా విజయం పట్ల గోపీచంద్ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం బీ. గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నానని, జూలై నెలలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమలో కొత్త కథలకు కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. సినీ రచయితలు సమాజాన్ని దగ్గరనుంచి పరిశీలించినప్పుడు మన దగ్గరే కొన్ని వందల కథలు పుట్టుకొస్తాయని ఆయన అన్నారు. సరైన పాయింట్, కథతో వచ్చినపుడు విప్లవ కథల్లో నటించడానికి తనకే అభ్యంతరం లేదని గోపీచంద్ తెలిపారు. గోపీచంద్ తండ్రి టి. కృష్ణ విప్లవ చిత్రాల దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించిన విషయం తెలిసిందే!