‘సీతమ్మ వాకిట్లో..’ రికార్డును బ్రేక్ చేసిన ‘శాతకర్ణి’!


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలను అందుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక ఈ వారాంతం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో శాతకర్ణి ఇంకా మంచి వసూళ్ళు రాబడుతోంది.

ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకూ 1.64 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (1.63మిలియన్ డాలర్లు) రికార్డును బ్రేక్ చేసింది. దీంతో శాతకర్ణి ఇప్పుడు యూఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల కలెక్షన్స్ పరంగా 8వ స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించారు.