‘గౌతమిపుత్ర శాతకర్ణి’ బిజినెస్ మొత్తం పూర్తైందట!
Published on Oct 30, 2016 10:23 am IST

gpsk
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రాంతాల బిజినెస్ మొత్తం పూర్తవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. అన్ని ప్రాంతాల్లోనూ బాలయ్య కెరీర్‌ బెస్ట్ బిజినెస్ జరుగడం మరింత విశేషం.

నైజాం, సీడెడ్, ఓవర్సీస్, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, కర్ణాటక.. ఇలా తెలుగు సినిమాకు మార్కెట్‌లు అయిన అన్ని ప్రాంతాల్లో బిజినెస్ పూర్తైంది. ఇక సాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కూడా ఇప్పటికే అమ్ముడైపోయాయి. దర్శక, నిర్మాత క్రిష్ సైతం తమ సినిమా బిజినెస్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గౌతమి పుత్ర శాతకర్ణికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి…

నైజాం ప్రాంత హక్కులను హీరో నితిన్‌కు చెందిన గ్లోబల్ సినిమాస్ 11.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
గుంటూరు ప్రాంత హక్కులను ఎస్.పిక్చర్స్ సుమారు 4.50 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సీడెడ్ హక్కులను 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా హక్కులను 3.60 కోట్ల రూపాయలకు బేకరీ ప్రసాద్ కొనుగోలు చేశారు.
నెల్లూరు హక్కులను భరత్ 1.98 కోట్లకు సొంతం చేసుకున్నారు.
ఇక సాటిలైట్ హక్కులను మాటీవి 9 కోట్లకు సొంతం చేసుకోగా, ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook