కనీ వినీ ఎరుగని రీతిలో ‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !


ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి- 2’ ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న సందర్బంగా చిత్ర టీమ్ ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కోసం రాజమౌళి చిత్ర షూటింగ్ కోసం రూపొందించిన మాహిష్మతి సామ్రాజ్యపు సెట్ ను వినియోగిస్తున్నారు. అంతేగాక ఎన్నడూ లేని విధంగా 360 డిగ్రీల కోణంలో లైవ్ స్ట్రీమింగ్ అందించనున్నారు.

అందుకోసం బెస్ట్ టెక్నికల్ టీమ్ తో వర్క్ చేయిస్తున్నారు. ఇకపోతే ఈ వేడుకకు బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రత్యేక అతిధిగా రానున్నారు. అలాగే తెలుగు పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. చిత్రంలోని మొత్తం ఐదు పాటలను ఈరోజే విడుదల చేయనున్నారు. జాతీయ స్థాయి మీడియా చానెళ్లు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయనున్నాయి. ఇక తెలుగు అభిమానులైతే సాయంత్రం 5గంటల నుండి ఈ వేడుకను జక్కన్న ఎలా ప్లాన్ చేశారో చూడాలని ఉవ్విళూరుతున్నారు.