‘శ్రీరస్తు శుభమస్తు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు భారీ ఏర్పాట్లు!

1
అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సాయంత్రం హైద్రాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఆడియో విడుదల కూడా చేపట్టకపోవడంతో ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్‌నే పెద్ద ఎత్తున చేపడుతున్నారు.

మెగా స్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న ఈ వేడుక కోసం టీమ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించారు. పరశురామ్ గత చిత్రాల్లానే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్‌గా శ్రీరస్తు శుభమస్తు నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు.