అఖిల్ – హను రాఘవపూడి సినిమా ఆగిపోలేదట!

akhil-hanu-raghavapudi
‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి, కొద్దిరోజుల క్రితం అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇద్దరూ ఖరారు చేస్తూ, తమ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని తెలియజేశారు. అయితే తాజాగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకుండా ఆగిపోయింది. దీంతో హను, నితిన్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైపోయారు.

కాగా తాజా సమాచారం మేరకు అఖిల్ సినిమా కేవలం వాయిదా పడిందని, ఆ సినిమా ఆగిపోలేదని తెలిసింది. ఈ సినిమాను నిర్మించనున్న మైత్రీ మూవీ మేకర్స్, అఖిల్ మూడో సినిమాగా ఈ ప్రాజెక్టును రెడీ చేయనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందట. అఖిల్, నితిన్ ఇద్దరికీ హను వేర్వేరు కథలు సిద్ధం చేశాడని, అఖిల్ కథ అలాగే ఉందని తెలుస్తోంది. ఇక అఖిల్ రెండో సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.