ప్రస్తుతానికి తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు : సమంత

samantha
సౌతిండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఈ ఏడాది వేసవి సీజన్ నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘తేరీ’, ’24’, ‘అ..ఆ..’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలుగా నమోదై సమంత క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. అయితే ‘జనతా గ్యారేజ్’ విడుదలై రెండు నెలలు అవుతున్నా సమంత తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఈ మధ్యలో చాలా సినిమాల్లో ఆమె నటిస్తున్నట్లు వార్తలొచ్చినా అవేవీ నిజమవ్వలేదు.

దీంతో సమంత ఏ సినిమా చేస్తారా? అని ఎదురుచూసిన వారందరికీ సమాధానంగా విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ తమిళ సినిమాను ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాను మినహాయిస్తే సమంత వేరే ఇతర సినిమాలేవీ ఒప్పుకోలేదట. తెలుగులో అయితే ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. తిరుగులేని విజయాలతో కొనసాగుతోన్న ఈ పరిస్థితుల్లో తెలుగులో సినిమాలు ఎందుకు ఒప్పుకోవట్లేరంటే సరైన సినిమాలు రావడం లేదన్న సమాధానం వినిపిస్తోంది. మరి సమంత ఒప్పుకునే తదుపరి తెలుగు సినిమా ఏమై ఉంటుందన్నది ఇప్పటికి ప్రశ్నార్థకమే!