హై కోర్టులో హాజరుకానున్న అలనాటి స్టార్ హీరోయిన్ !


1980, 90 ల కాలంలో తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది ‘కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సరికొత్త భాష్యం చెప్పిన నటి, ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి ఎంపీగా గెలిచిన విజయశాంతిని ప్రస్తుతం ఒక ప్రాపర్టీ వివాదంలో మధ్యవర్తిత్వం చేసిన వ్యవహారంలో ఈ నెల 18న కోర్టులో హాజరావాల్సిందిగా మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే ఇందిర్ చాంద్ జైన్ అనే వ్యక్తి తనపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇచ్చిన పిర్యాదును, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ విజయశాంతి పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక ఇరు పార్టీలు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒప్పుకున్నాయని అందుకే వివాదాన్ని మీడియేషన్ సెంటర్ కు రెఫర్ చేయాలని కోరారు.

పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఇరు పార్టీలు తమ ముందు హాజరైతే తప్ప వివాదాన్ని మీడియేషన్ సెంటర్ కు రెఫర్ చేయడం జరగదని, కాబట్టి ఇరువురు సెప్టెంబర్ 18న కోర్టులో హాజరవాలని ఆదేశించింది.