నందమూరి తారకరత్న అంత్యక్రియల వివరాలు

Published on Feb 18, 2023 11:10 pm IST


నందమూరి తారకరామారావు గారి మనవళ్లలో ఒకరైన తారకరత్న నేడు కొద్దిసేపటి క్రితం అకాల మరణం పొందారు. దాదాపుగా 23 రోజులుగా బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తారకరత్న మరణం నిజంగా చిత్ర సీమకు తీరని లోటు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకుంటున్నారు. కాగా ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి చెందుతున్నారు. కాగా వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక తారకరత్న పార్థివదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి అనగా సోమవారం ఉదయం 7 గం.ల నుంచి సాయంత్రం 4 గం. ల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

అనంతరం సోమవారం సాయంత్రం 5 గం. లకి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుపనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.1983 ఫిబ్రవరి 22 న జన్మించిన తారక రత్న నందమూరి వారసుడుగా 2002 లో హీరోగా ఒకటో నంబర్ కుర్రాడు మూవీతో ఎంట్రీ ఇచ్చి ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కారు. అలా ఒకే రోజు 9 సినిమాల ప్రారంభం ప్రపంచంలో మరే హీరోకి లేని అరుదైన రికార్డ్. ఇక తన సినీ కెరీర్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 సినిమాల్లో నటించారు తారకరత్న. గత ఏడాది 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన తారకరత్న ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి ముద్దుల కూతురు పేరు నిష్క. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన తారకరత్న 2009 లో అమరావతి సినిమాకి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు.

సంబంధిత సమాచారం :