‘కబాలి’కి అతిపెద్ద హైలైట్‌గా నిలిచే అంశమిదే!

21st, July 2016 - 07:24:00 PM

kabali1
‘కబాలి’.. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సినీ అభిమానులందరి నోళ్ళలో నానుతున్న పేరు. ఆకాశాన్నంటిన అంచనాల మధ్యన మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు దగ్గర పడుతున్నా కొద్దీ పలు సరికొత్త కథనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా కబాలికి హైలైట్‌గా నిలిచే అంశం ఏదనే విషయమై ఓ ఆసక్తికర కథనం తెలిసింది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఈ ఎపిసోడ్‌లో రజనీ యంగ్‌లుక్‌లో ఆకట్టుకోనున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది. మలేషియాలో తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా రజనీ ఈ సినిమాలో కనిపించనున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు. ఇప్పటికే మలేషియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కబాలి షోస్ పడిపోగా, రేపు (జూలై 22న) ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో సుమారు 4000 థియేటర్లలో సందడి మొదలవుతుంది.