ఈ సంవత్సరం ఆఖరి పోటీ ఆ ఇద్దరు హీరోలకే!

naresh-rohith
తెలుగు పరిశ్రమలో ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు రిలీజవడం, హీరోలు పోటీ పడటం ఆనవాయితీగా వస్తున్నదే. ఆ ఆనవాయితీ ప్రకారమే రాబోయే శుక్రవారం అనగా డిసెంబర్ 30న కూడా రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఇది ప్రతిసారి జరిగేదే అయినా ఈ శుక్రవారానికి మాత్రం కాస్త ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ 2016 వ సంవత్సరానికి గాను ఇదే ఆఖరు శుక్రవారం, ఇదే ఆఖరు పోటీ, ఇవే ఆఖరు డైరెక్ట్ తెలుగు రిలీజ్ లు. ఈ ప్రత్యేకమైన రోజున పోటీపడబోయే ఆ ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, నారా రోహిత్.

ఈ సంవత్సరం ‘సెల్ఫీ రాజా’ అనే ఒక్క సినిమాని మాత్రమే రిలీజ్ చేసి దాని పరాజయంతో నిరుత్సాహపడ్డ అల్లరి నరేష్ జి. నాగేశ్వర రెడ్డి కాంబోలో చేసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం నెల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలచేత వాయిదాలుపడి చివరికి సంవత్సరం ఆఖరుకు రిలీజవుతోంది. ఇక ఈ యేడు ‘జ్యో అచ్యుతానంద’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నారా రోహిత్ ఆ విజయోత్సాహాన్ని కంటిన్యూ చేయడానికి దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో పోటీలోకి దిగుతున్నాడు. మరి ఈ ఆఖరి పోటీలో ఏ హీరో నెగ్గుతాడో చూడాలి మరి.