అఖిల్‍ సినిమాకు గౌతమ్ మీనన్ హీరోయిన్..!

akhil
అక్కినేని అఖిల్.. గత సంవత్సర కాలంగా సోషల్ మీడియాలో బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న పేరు. అక్కినేని వారసత్వాన్ని అందిపుచ్చుకొని భారీ అంచనాల మధ్యన తన మొదటి సినిమా ‘అఖిల్‌’తో వచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమాతో అందర్నీ నిరాశపరిచారు. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందిన అఖిల్ తర్వాత, సంవత్సరమైనా రెండో సినిమాను మొదలుపెట్టలేదాయన. ఎంతో మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాక, చివరికి ‘ఇష్క్’, ‘మనం’, ’24’ లాంటి సినిమాలతో క్లాస్ డైరెక్టర్ అనిపించుకున్న విక్రమ్ కుమార్‌తో సినిమాను ఓకే చేశారు.

త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేశారట. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ఎన్నై నొక్కి పాయుమ్ తోట్టా అనే సినిమాతో మేఘా హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇక ఇంకా పూర్తి స్థాయిలో స్క్రీన్‌పై దర్శనమివ్వకముందే మేఘా అఖిల్ సినిమాకు కూడా ఎంపికవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.