భారీ స్థాయిలో ‘ కాటమరాయుడు’ టైటిల్ సాంగ్ !


స్టార్ హీరోల సినిమాల్లో ప్రేక్షకులు ప్రత్యేకంగా వెతికే అంశం టైటిల్ సాంగ్. తమ అభిమాన కథానాయకుడి గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేస్తూ నడిచే ఆ పాట థియేటర్లో ఫ్యాన్స్ కు ఇచ్చే కిక్ అంతా ఇంతా కాదు. అందుకే అంత ప్రాముఖ్యమున్న ఆ పాటలను దర్శకులు కాస్త ఎక్కువ దృష్టి పెట్టి చిత్రీకరిస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ లో కూడా అదే చేశారు దర్శకుడు డాలి. పవన్ కళ్యాణ్ మీద నడిచే ఈ టైటిల్ సాంగ్ ను చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు.

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి రూపొందించిన భారీ సెట్లో సుమారు 400 మంది డ్యాన్సర్లతో ఈ పాటను రూపొందించారట. అనూప్ రూబెన్స్ ఈ పాటకు అందించిన సంగీతం, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అన్నీ చాలా బాగా కుదిరినట్టు తెలుస్తోంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తమ్ముళ్లుగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ, అజయ్ లు నటిస్తున్నారు. ఈ మార్చి నెల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి 24వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నారు.