ఫీచర్ స్టోరీ : ఒక్క సినిమా.. మొత్తం కథ మార్చేసే వేళ..!
Published on Jul 24, 2016 9:10 pm IST

babu-bangaram-thikka-janath
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు శుక్రవారం వచ్చిందంటే, పండగే! ఎంత పెద్ద స్టార్ అయినా, ఆ శుక్రవారం రోజున సినీ అభిమానుల నుంచి వచ్చే ‘సినిమా బాగుంద’నే మాట కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సినిమా బిజినెస్ పూర్తిగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో, వారం, రెండు వారాల తర్వాత ఎంత పెద్ద సినిమా అయిన థియేటర్లను ఖాళీ చేయాల్సిన రోజుల్లో ఒక సినిమాకు సరైన విడుదల తేదీ దొరకడమనేది అంత సులువైన విషయం కాదు. అందులోనూ కోట్ల రూపాయల బిజినెస్ జరిగే పెద్ద స్టార్స్ సినిమాలకు విడుదల తేదీని ఖరారు చేయడమంటే మాటలు కాదు. ఈ విషయంలోనే తెలుగు సినిమా, హాలీవుడ్, బాలీవుడ్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలన్నది ఎప్పుడూ వినిపించే ఒక మాట.

హాలీవుడ్‌లో ఇండిపెండెంట్ ఫిల్మ్‌మేకర్స్ విషయం పక్కనబెడితే, పెద్ద స్టూడియోలన్నీ తమ సినిమాలన్నింటికీ సెట్స్‌పైకి వెళ్ళేముందే పక్కాగా ఒక విడుదల తేదీని నిర్ణయిస్తాయి. 2019లో విడుదలయ్యే ఒక సినిమాకు కూడా ఇప్పుడే విడుదల తేదీని ఫిక్స్ చేసే స్టూడియోలు కూడా హాలీవుడ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ చిన్న సినిమాలు, ఇతర మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాలూ ఈ పెద్ద సినిమాల మధ్యలో వీలు కుదుర్చుకొని వచ్చేలా ప్లాన్ చేసుకుంటాయి. ఇక మన ఇండియన్ సినిమాలోనే భాగమైన బాలీవుడ్‌ కూడా ఇదే పద్ధతిని చాలాకాలం క్రితమే అందిపుచ్చుకొంది. అక్కడ పెద్ద హీరోలు నటించే సినిమాలన్నీ పక్కాగా ముందే ఒక విడుదల తేదీకి ఫిక్స్ అయిపోతాయి. మళ్ళీ సినిమా ఆ రోజున విడుదల కాలేకపోవడం, దానివల్ల ఇతర సినిమాలన్నీ ఇబ్బందులు పడడం అన్నది అరుదుగా మాత్రమే కనిపిస్తుంటుంది. అయితే సరిగ్గా ఇక్కడే మన తెలుగు సినిమా ఎప్పుడూ తడబడుతూ ఉంటుంది.

తెలుగులో గత కొద్ది సంవత్సరాలుగా ఒక పెద్ద సినిమా చెప్పిన తేదీకి థియేటర్లలో వాలిపోయిన సందర్భాలు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలోనే చూసుకుంటే సూపర్ స్టార్ రజనీ హీరోగా నటించిన ‘కబాలి’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమాలు సరైన తేదీకి విడుదల కాకపోవడంతో రెండు నెలల పాటు చిన్న సినిమాలు, మిడిల్ బడ్జెట్ సినిమాల షెడ్యూల్స్ అన్నీ మారిపోయాయి. ముందే ప్లాన్ చేసినట్లు వస్తే, ‘కబాలి’ జూలై 15న, ‘జనతా గ్యారెజ్’ ఆగష్టు 12న విడుదల కావాలి. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాలు వాయిదా పడుతూ వచ్చి, ‘కబాలి’ జూలై 22కు, ‘జనతా గ్యారెజ్’ సెప్టెంబర్ 2కు మారిపోయాయి.

ముందుగా ‘కబాలి’ విడుదల జూలై 22కి మారడంతో ఆ ఎఫెక్ట్ ‘బాబు బంగారం’ సినిమాపై పడింది. ఇదే నెల 29న విడుదల కావాల్సిన ఈ సినిమాకు ఆ తర్వాత సరైన విడుదల తేదీ దొరకలేదు. ఇక ఇదే నెలలో విడుదల కావాల్సిన చాలా సినిమాలు ఆగష్టు నెలాఖరుకు మారిపోయాయి. కాగా ఇక్కడే మళ్ళీ ‘జనతా గ్యారెజ్’ వాయిదా పడడంతో కొత్త చిక్కు వచ్చి పడింది. ‘జనతా గ్యారెజ్’ వాయిదా పడడంతో ఆగష్టు రెండో వారం ఖాళీ అయిపోయింది. స్వాతంత్ర్యం దినోత్సవం రోజు (సెలవు దినం)తో కలుపుకొని లాంగ్ వీకెండ్ ఉన్న వారం కావడంతో, వెంటనే ఈ రెండు నెలల్లోనే విడుదలవుతాయనుకున్న సినిమాలన్నీ ఆ వారానికి వచ్చి చేరాలని ప్రయత్నించాయి. ముందే సిద్ధంగా ఉన్న సినిమాలు ఈ వారంలో రావడం మంచిదే అయినా కొన్ని ఏ ప్లానింగ్ లేకుండా ఈ వారంలో రావాలనుకోవడం అసలైన ఇబ్బంది. ఆ సినిమాలకు సరైన ప్రమోషన్స్ కూడా జరిగే అవకాశం ఉండదు.

వీటన్నింటికీ మించి ‘జనతా గ్యారెజ్’ సెప్టెంబర్‌కి వెళ్ళడంతో అదే నెలలో మొదటి వారమో, రెండో వారమో రావాలనుకున్న సినిమాల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఆ సినిమాలు ఇటు ఆగష్టులో రాలేక, సెప్టెంబర్‌లో ‘జనతా గ్యారెజ్‌’తో పాటే వచ్చే ఇతర పెద్ద సినిమాలతో నిలవలేక, మళ్ళీ దసరా తర్వాత రావాల్సి ఉంటుంది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి సినిమా తీసే నిర్మాతకు ఇలా సినిమాకు సరైన విడుదల తేదీ దొరకకపోవడం ఇబ్బంది పెట్టే అంశమే!

‘కబాలి’, ‘జనతా గ్యారెజ్‌’ల విడుదల తేదీల్లో వచ్చిన మార్పుల వల్ల చాలా సినిమాలు వాటి విడుదల తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. ఇందులో కొన్ని సినిమాలకు లాభం కలిగితే, చాలా సినిమాలకు ఈ మార్పు నిరాశ మిగిల్చింది. మొదటగా ‘బాబు బంగారం’ సినిమా ఎన్నోసార్లు అయోమాయంలో పడి ఆగష్టు 12కి ఖరారు అయింది. సాయిధరమ్ తేజ్ ‘తిక్క’ ఆగష్టు 13న, మోహన్ లాల్ ‘మనమంతా’ ఆగష్టు 5న, ‘శ్రీరస్తు శుభమస్తు’ ఆగష్టు 5న.. ఇలా చాలా తేదీలు విడుదల తేదీలు మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ గమనించాక అయినా పెద్ద సినిమాల నిర్మాతలు తమ సినిమాలకు ఒక విడుదల తేదీని పక్కాగా నిర్ణయించి, అదే తేదీన సినిమా వచ్చేలా ప్రొడక్షన్‌ను ప్లాన్ చేయాలన్నది ఎక్కువమంది దగ్గర్నుంచి వినిపిస్తోన్న మాట.

 
Like us on Facebook