
ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమ చూపంతా మే 31న రిలీజ్ కానున్న ‘బాహుబలి’ ఆడియో మరియు ట్రైలర్ పైనే ఉంది. ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు రెండేళ్ళ నుంచి నుంచి నిర్విరామంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం సర్వం సిద్దం చేస్తున్నారు. రాజమౌళి మునుపెన్నడూ లేని రీతిలో, ఈ ఆడియో లాంచ్ గురించి యావత్ భారతదేశం మాట్లాడుకునేలా ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఆడియో లాంచ్ కోసం ఓ సరైన వేదిక కోసం అన్వేషిస్తున్నారు. ఫైనల్ గా ఈ చిత్ర టీం బాహుబలి ఆడియో లాంచ్ కోసం హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ ని ఫైనలైజ్ చేసారు.
ఈ ఆడియో లాంచ్ కి భారీగా అభిమానులు తరలిరానుండడంతో హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ ని ఎంపిక చేసారు. ఈ వేడుకకి సౌత్ మరియు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు బడా బడా సూపర్ స్టార్స్ హాజరు కానున్నారు. ఈ హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ లో ట్రైలర్ ని ప్లే చెయ్యడం కోసం ఓ భారీ ఎల్.ఈ.డీ స్క్రీన్ ని కూడా సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్య రాజ్, నాజర్, సుధీప్, అడవి శేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.