బాలీవుడ్ ని సైతం ఆకట్టుకున్న తమిళ చిత్రం !

13th, March 2017 - 03:45:12 PM


ఇటీవల తమిళ పరిశ్రమలో మంచి సక్సెస్ సాధించిన సినిమాల్లో ‘ధృవంగల్ పతిన్నారు’ కూడా ఒకటి. నూతన దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 29న విడుదలై ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ ప్రాజెక్టులో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెహమాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం గత శుక్రవారం తెలుగులో సైతం విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

దీంతో ఈ చిత్రం బాలీవుడ్ దృష్టిలో కూడా పడింది. అయితే ఈసారి తెలుగులోలా డబ్ కాదు ఏకంగా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ రీమేక్ హక్కుల కోసం కూడా భారీ పోటీ నెలకొందని కూడా తెలుస్తోంది. సీనియర్ నటుడు ఒకరు ఈ రీమేక్ లో నటించనున్నారట. అయితే ఆయన ఎవరు, ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద 21 ఏళ్ళ కార్తిక్ నరేన్ మొదటి చిత్రంతోనే అన్ని పరిశ్రమల పెద్దల్ని తన వైపుకు తిప్పుకున్నాడు.