దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ సృష్టించిన ప్రభంజనం చూస్తుంటే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక అపూర్వమైన దృశ్యకావ్యంగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు వస్తున్న డిమాండ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ పంపిణీ సంస్థ ‘ఫార్స్ ఫిలిమ్స్’ ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ స్థాయి ధర పలకడం ఒక రికార్డ్. మహేష్ బాబు స్టార్ పవర్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవ్వడంతో, సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలవ్వకముందే ఈ రేంజ్ బిజినెస్ జరగడం గమనార్హం.
రాజమౌళి గత చిత్రాలైన ‘బాహుబలి 2’, ‘RRR’ అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు ఈ భారీ ఆఫర్లకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికా వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటూ బిజీగా ఉంది. కేవలం ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లు పలుకుతుంటే, రాబోయే రోజుల్లో థియేట్రికల్, శాటిలైట్ హక్కులు ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తాయో అని పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది.
