‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్ లాంచ్‌కు భారీ ప్లాన్స్!

18th, October 2016 - 11:25:09 PM

baahubali
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’కి రెండో భాగమైన ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి మొదటి భాగానికి ఎన్నో రెట్లు మించేలా రెండో భాగం ఉండేలా సినిమా కోసం కష్టపడుతూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రమోషన్స్ విషయంలో ఎవ్వరూ చేయని ప్రమోషన్స్ బాహుబలి 2కి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్‌లుక్ లాంచ్‌తో ఈనెల 22న బాహుబలి టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది.

హీరో ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) పురస్కరించుకొని రాజమౌళి ఈ ఫస్ట్‌లుక్‌ను ప్లాన్ చేశారు. ఇక ఈ ఫస్ట్‌లుక్‌ కోసం టీమ్ భారీ ఎత్తున ప్లాన్ చేసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అక్టోబర్ 22 సాయంత్రం 4 గంటల నుంచి బాహుబలి ఫస్ట్‌లుక్ సందడి మొదలవుతుందట. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగమైన మూవీమేళా అనే ప్రోగ్రామ్‌లో ఈ ఫస్ట్‌లుక్‌ విడుదలవుతుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు 360డిగ్రీ మేకింగ్ వీడియో, వర్చువల్ రియాలిటీ ప్రోమో, గ్రాఫిక్ నావెల్ ప్రివ్యూ విడుదల కానున్నాయి. రాజమౌళితో సహా టీమ్ అంతా హాజరై ఫస్ట్‌లుక్ విడుదలను చేపట్టనున్నారు.