బాలయ్య యూఎస్ టూర్‌కు సూపర్ రెస్పాన్స్!

22nd, January 2017 - 09:51:12 AM

bala-krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా విడుదలై హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బాలయ్య హీరోగా నటించిన వందో సినిమా కావడం, విలక్షణ దర్శకుడు క్రిష్ సినిమా కావడంతో శాతకర్ణిపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలను అందుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది.

తెలుగు సినిమాకు ఈమధ్య కాలంలో పెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్‌లోనూ గౌతమిపుత్ర శాతకర్ణి వసూళ్ళ వర్షం కురిపించి బాలయ్య కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచనతో బాలకృష్ణ యూఎస్ టూర్‌కు వెళ్ళారు. ఇప్పటికే డల్లాస్, డెట్రాయిట్ తదితర ప్రాంతాల్లో టూర్ ముగించుకున్న ఆయన చివరిరోజు న్యూయార్క్‌లో అభిమానులను కలవనున్నారు. ఆదివారం రాత్రి అక్కడి అభిమానులతో ముచ్చటించాక ఆయన తిరిగి ఇండియా ప్రయాణమవుతారు. ఇక బాలయ్య టూర్‌కు యూఎస్‌లోని ఆయన అభిమానుల దగ్గర్నుంచి పెద్ద రెస్పాన్స్ వస్తోంది. బాలయ్యను చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు.