నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ‘హైపర్’!

hyper
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, ప్రస్తుతం తన కొత్త సినిమా ‘హైపర్‌’ను శరవేగంగా పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా వైజాగ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను జరుపుతూ వచ్చిన టీమ్, నిన్నటితో ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఇక వైజాగ్ షెడ్యూల్ ఇలా పూర్తైందో లేదో వెంటనే హైద్రాబాద్‌లో నేటినుంచి మరో షెడ్యూల్ మొదలుపెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. ముందే ప్రకటించినట్లు సెప్టెంబర్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది.

రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 14 రీల్స్ పెద్ద ఎత్తున నిర్మిస్తోండగా, గిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దసరా సీజన్‌కు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో సినిమా మెప్పిస్తుందని నిర్మాతల్లో ఒకరైన రామ్ సుంకర్ తెలిపారు.