ఇంటర్వ్యూ: నారా రోహిత్ – ఎప్పుడైనా విభిన్నమైన సినిమాలు చేయడమే నాకిష్టం !
Published on Jul 11, 2017 3:23 pm IST


వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్ చేసిన మల్టీ స్టారర్ చిత్రం ‘శమంతకమణి’. నలుగురు హీరోలు కావడంతో మొదటి నుండి మంచి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ వారమే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన నారా రోహిత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీ ‘శమంతకమణి’ ఎలా ఉండబోతోంది ?
జ) డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య చాలా బాగా తీశారు. మంచి కథ కావడంతో ఔట్ ఫుట్ బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుంది.

ప్ర) నలుగురు హీరోలు కదా వాళ్ళను హ్యాండిల్ చేయడం దర్శకుడికి కష్టమనిపించలేదా ?
జ) లేదు. మొదటి నుండి శ్రీరామ్ చాలా క్లియర్ గా ఉండేవాడు. ప్రతి పాత్ర ఎలా ఉండలి, ఎవరు చేయాలి అనేది ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. అందుకే ఎలాంటి ఇబ్బందీ లేకుండా సినిమాను పూర్తి చేశాడు.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నాది రంజిత్ కుమార్ అనే పోలీసాఫీసర్ పాత్ర. చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ పాత్ర ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడం కష్టం.

ప్ర) మీ పాత్ర మీకేమైనా కష్టమనిపించిందా ?
జ) లేదు. ఎలాంటి కష్టం ఫీలవలేదు. ఎందుకంటే ఆ పాత్ర నాకు చాలా బాగా సరిపోయింది. శ్రీరామ్ కూడా నాకు ఆ పాత్రే చెప్పాడు. వినగానే ఓకే నేను చేస్తేనే బాగుంటుందనుకుని ఒప్పుకున్నాను.

ప్ర) ఇందులో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది ?
జ) ఒక పాత్ర తక్కువ ఇంకొకటి ఎక్కువ అనేం లేదు. ప్రతి పాత్రకు ఒక కథ, ప్రాముఖ్యత ఉంటుంది. అందరు హీరోలకు న్యాయం జరిగింది.

ప్ర) శ్రీరామ్ పనితనం ఎలా అనిపించింది ?
జ) ఒకేసారి నలుగురు హీరోలని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఒక వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని కథను రాసుకున్నాడు. ముందే పక్కా స్క్రిప్ట్ తయారుచేసుకోవడం వలన త్వరగా సినిమా పూర్తి చేశాడు.

ప్ర) మీ పాత్ర కాకుండా ఇంకే పాత్రంటే మీకిష్టం ?
జ) నా పాత్రంటే నాకు ఎక్కువ ఇష్టం. నాది కాకుండా అంటే సుధీర్ బాబు చేసిన పాత్ర ఇష్టం. ఎందుకంటే అందులో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.

ప్ర) బరువు బాగా తగ్గారు ఎందుకు ?
జ) ఒక పాత్ర కోసం తగ్గాల్సి వచ్చింది. పవన్ మల్లెలతో ఒక సినిమా చేస్తున్నా. అది పూర్తిగా విభిన్నమైన కమర్షియల్ సినిమా. నా పుట్టినరోజుకి దాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచన ఉంది. టైటిల్ దగ్గర్నుండి అంతా భిన్నంగానే ఉంటుంది.

ప్ర) ‘వీర భోగ వసంతరాయలు’ హిస్టారికల్ సినిమానా ?
జ) కాదు. ప్రస్తుతానికి సంబంధించినదే. నేను సుధీర్ బాబు కలిసి ఒక కొత్త జానర్ ను క్రియేట్ చేయాలనుకుని చేసిన సినిమా. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక సోషల్ సినిమాలాంటిది. ప్రస్తుతం షూట్ జరుగుతోంది.

ప్ర) ఇకపై కూడా ఇలాంటి సినిమాలే చేస్తారా లేకపోతే కమర్షియల్ సినిమాలు కూడా చేస్తారా ?
జ) (నవ్వుతూ) నేను కమర్షియల్ హీరోనా లేకపోతే ఇలాంటి జానర్ సినిమాలే చేయాలా అనే క్లారిటీ ఇంకా పూర్తిగా రాలేదు. ఒక రకంగా భిన్నమైన సినిమాలే నాకు మంచి గుర్తింపునిచ్చాయి. అందుకే ఎప్పుడైనా అలాంటివి చేయడానికే ఎక్కువ ఇష్టపడతాను.

 
Like us on Facebook