ప్రత్యేక ఇంటర్వ్యూ : నాని – ప్రేక్షకులతో పాటే ఓ మూలాన నిల్చుని సినిమా చూస్తా !

nani
‘భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మెన్’ వంటి వరుస విజయాలతో యంగ్ హీరో నాని టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘మజ్ను’ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్బంగా సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం

ప్ర) ప్రస్తుతమున్న స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్నారు ?
జ) నిజానికి స్టార్ డమ్ అంటే ఏమిటో నాకు అర్థం కాదు. ప్రస్తుతం అంతా బాగానే నడుస్తోంది. దీన్నే కొనసాగిద్దామనుకుంటున్నాను. నటుడిగా నేను సక్సెస్ లో ఉన్నంత వరకూ స్టార్ డమ్ అలానే ఉంటుంది. ఎప్పుడైతే నటుడిగా నేను ఫెయిల్ అవుతానో అప్పుడు నేను ఎంత మాత్రం స్టార్ ని కాదు.

ప్ర) మీకొచ్చిన స్టార్ డమ్ వల్ల మీలో ఏమైనా మార్పొచ్చిందా ?
జ) లేదు. మొదట ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇప్పుడు చేతి నిండా పనుంది. ఒక నటుడికి ఇంతకన్నా ఏం కావాలి. స్టార్ డమ్ కోసం ప్రత్యేకంగా ఏం చెయ్యను. ఎప్పుడైతే ఇలా చెయ్యాలి, ఆలా చెయ్యాలి అని లెక్కలేసుకుంటానో అప్పుడు ఖచ్చితంగా నా స్థాయి కిందకి పడిపోతుంది.

ప్ర) ‘మజ్ను’ తో మరో హిట్ సాధిస్తారని నమ్మకంగా ఉన్నారా ?
జ) చేసిన సినిమా హిట్టవ్వాలని ఎవరికుండదు. నేనూ అంతే. అందరిలాగే సినిమా రిలీజయ్యేటప్పుడు కాస్త కంగారు ఫీలవుతా.

ప్ర) ఎప్పుడూ ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూంటారెందుకు ?
జ) మనం ప్రేక్షకుల కోసమే సినిమా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితమైన స్పందన వాళ్ళ దగ్గర్నుంచి వస్తుంది. మనం ఒక అంశాన్ని నమ్మి సినిమా చేస్తాం. ఆ సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా అదే అంశం మీద ఉన్నారో లేదో తెలుసుకోవాలి. నా వరకు ప్రేక్షకుల స్పందనే ముఖ్యం. అందుకే ప్రేక్షకులతో కలిసి థియేటర్ కి వెళ్లి ఓ మూలాన నిల్చుని సినిమా చూస్తా. ఆ అనుభవం నాకు చాలా తృప్తినిస్తుంది.

ప్ర) కలెక్షన్ల పరంగా మీ సినిమాల రేంజ్ బాగా పెరిగింది. దీని పట్ల మీ ఫీలింగ్ ?
జ) నేనెప్పుడూ సినిమాని వ్యాపారంగా చూడను. ప్రేక్షకుల ప్రశంసలే నాకు ముఖ్యం. ఎంత ఎక్కువ మంది జనాలు నా పనిని ఇష్టపడితే నేనంత సక్సెస్ అయినట్టు భావిస్తా.

ప్ర) ఫ్యూచర్ లో ఎలాంటి స్టార్ అవుదామని అనుకుంటున్నారు ?
జ) స్టార్ అన్నదానికి కొన్ని దశాబ్దాలుగా అర్థం మారుతూనే ఉంది. పెద్ద పెద్ద పాత్రలు చేసి ఎన్టీఆర్ స్టార్ అయితే, చిరంజీవిగారు డ్యాన్సులు, ఫైటింగులతో మెగా స్టార్ అయ్యారు. నా వరకూ రాబోయే భవిష్యత్తులో కథే అన్నిటికన్నా, అందరికన్నా పెద్ద స్టార్ అవుతుంది.

ప్ర) అంటే మీకు నెం 1 రేస్ మీద నమ్మకం లేదా ?
జ) నేను ఏ లీగ్ లో గాని, రేస్ లో గాని ఉండను. అలాంటివి నాకు నచ్చవు. నా సినిమాలు, నా నటన వేరు. ఎలాంటి పాత్రైనా చేయగల నటుడన్న పేరు తెచ్చుకుంటే చాలు.

ప్ర) ఇప్పుడు మీకోసమే ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ?
జ) చాలా బాగుంది. నేను కూడా స్క్రిప్ట్స్ రాసె టైమ్ లో కొంతమందిని దృష్టిలో పెట్టుకుని రాసేవాడిని. ఇప్పడొస్తున దర్శకులు, రచయితలు వాళ్ళు రాసే సినిమాలకు నేను సరిపోతాననుకుంటే అది నాకు చాలా సంతోషం.

ప్ర) ఓవర్సేస్ లో మీకు ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. దాని గురించి ఏమంటారు ?
జ) నన్ను ఇంట బాగా ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ నా కృతాజ్ఞతలు. చెప్పాలంటే నేనేదీ ముందుగా ప్లాన్ చేయలేదు. ఈరోజుల్లో సినిమాలు మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినా కూడా చాలా బాగా ఆడుతున్నాయ్. ప్రేక్షకులకు ఏ సినిమాలు చూడాలో బాగా తెలుసు.

ప్ర) మీరిప్పటి వరకు ట్రై చేయని జానర్ ఏమైనా ఉందా ?

జ) ఆలోచిస్తూ ! నేనిప్పటివరకూ హారర్ సినిమాలు చేయలేదు. ఓ నటుడిగా నాకు అలాంటి సినిమాలు చాలెంజింగ్ గా ఉండవు. మొదటిరోజే సస్పెన్స్ రివీల్ అయిపోతే ఆ తరువాత అందులో ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదు.

ప్ర) ఈ మజ్ను సినిమాలో మిమ్మల్ని అంతగా ఆకర్షించిందేంటి ?
జ) ఐర్క్టర్ విరించి వర్మ నాకు కథ చెప్పిన విధానం, కథలో ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఈ కథ ప్రతి ఒక్కరికీ ఈజీగా రిలేట్ అయి ఉంటుంది.

ప్ర) ఫైనల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలంటారు ?
జ) సినిమాలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మొదటి నుండి సినిమా అయిపోయే వరకూ అది అలానే ఉంటుంది. సినిమాలోని కొత్తదనం, ఇన్నోసెన్స్ సినిమా చూసిన మీరు చిరునవ్వుతో బయటకొచ్చేలా చేస్తుంది.

ఇంతటితో ఇంటర్వ్యూ ముగిస్తూ ‘మజ్ను’ సినిమా విజయవంతం అవ్వాలని శుభాకాంక్షలు తెలిపాం.