ఇంటర్వ్యూ: విజయ్ ఆంటోనీ – నేను గొప్ప నటుడ్ని కాను.. అందుకే మంచి కథలు ఎంచుకుంటాను

ఇంటర్వ్యూ: విజయ్ ఆంటోనీ – నేను గొప్ప నటుడ్ని కాను.. అందుకే మంచి కథలు ఎంచుకుంటాను

Published on Feb 21, 2017 12:22 PM IST


‘బిచ్చగాడు, బేతాళుడు’ వంటి సినిమాలతో సంచలనం సృష్టించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఈయన చేస్తున్న ‘యమన్’ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటాయా ?

జ) ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో ఎలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉండవు. కథ మొత్తం కల్పితమే. గతంలో నేను చేసిన ‘నకిలీ’ సినిమాలాగే ఇది కూడా క్రియేట్ చేయబడిన స్టోరీనే.

ప్ర) సినిమాలో ఏం చూపబోతున్నారు ?
జ) సినిమా ప్లాట్ పాలిటిక్స్ కాబట్టి అసలైన రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, వారి బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. ఒక సామాన్యుడు మంత్రిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమాలో ప్రధాన అంశం.

ప్ర) తమిళనాడు రాజకీయాల ప్రస్తావన ఇందులో ఉంటుందా ?
జ) లేదు.. ఇందులో ప్రత్యేకంగా తమిళ రాజకీయాల గురించి ఏమీ చెప్పలేదు. 5 ఏళ్ల క్రితమే ఈ కథ తయారైంది. ఇప్పటి తమిళ పరిస్థితులకు, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథ అన్ని రాష్ట్రాల రాజకీయాలను టచ్ చేస్తుంది.

ప్ర) ‘యమన్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు ?
జ) చెడు పనులు చేసేవారికి ‘యమన్’ యముడులాంటి వాడు. యమన్ అంటే శివుడి అవతారం. ధర్మాన్ని కాపాడే యమధర్మరాజు. పురాణాల్లో కూడా యముడిని గొప్పగా చూపారు. ఈ సినిమాలో ఆ యముడిని కొత్త కోణంలో చూపడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో చెడు రాజకీయ నాయకులకు యముడు.

ప్ర) ఈ కథ విజయ్ సేతుపతి దగ్గర్నుంచి మీ దగ్గరకొచ్చిందా ?
జ) అవును.. దర్శకుడు ముందుగా ఈ కథను ఆయనకే చెప్పాడు. కానీ సేతుపతికి మరో 3 ఏళ్ల వరకు ప్రాజెక్ట్స్ ఉండటంతో ఆయన డేట్స్ కుదరలేదు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న నటుల్లో అయనే చాలా బిజీ యాక్టర్. దాంతో దర్శకుడు ఈ కథ నాకు చెప్పాడు. కథ నచ్చి నేను వెంటనే డేట్స్ ఇచ్చేశాను.

ప్ర) మీరు చేసిన ‘భేతాళుడు’ ఎందుకంత సక్సెస్ కాలేకపోయింది ?
జ) ‘భేతాళుడు’ మంచి సబ్జెక్ట్. కానీ సరిగా ఆడలేదు. సినిమా రిలీజయ్యాక మేం చేసిన తప్పేమిటో తెలిసింది. అదేంటంటే విలన్లని ఫస్టాఫ్ లోనే రివీల్ చేసుండాల్సింది. కానీ అలా చేయకపోవడంతో ఫస్టాఫ్ లో చెప్పిన జయలక్ష్మి పాత్ర వెనుక పెద్ద థ్రిల్లింగ్ కథ ఉంటుందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ సెకండాఫ్ లో అలా లేదు. దాంతో రిజల్ట్ అనుకున్న విధంగా రాలేదు. కానీ తమిళంలో మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చేశాయ్.

ప్ర) మొదటిసారి పొలిటికల్ జానర్ చేస్తున్నారు. ఎలా ఉంది ?
జ) చాలా హ్యాపీగా ఉంది. నాకు జానర్, డైరెక్టర్ తో పని లేదు. సినిమా కథ ఏమిటి అనేది మాత్రమే చూస్తాను. కథ బాగుంటే పొలిటికల్ డ్రామా సినిమాలు వరుసగా చేస్తాను. సాధారణంగా ఒకే తరహా సినిమాలు వరుసగా చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందంటారు. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే ఒకే తరహా సినిమాలనైనా ఆడియన్స్ ఆదరిస్తారు.

ప్ర) నటనతో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తుంటారు. రెండూ ఒకేసారి చేయడం ఎలా అనిపిస్తుంది ?
జ) ఒక నటుడు ప్రొడక్షన్ చేస్తే అతనికి నిర్మాత కష్టమేమిటో తెలుస్తుంది. ప్రొడక్షన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. సినిమా చేసి, ప్రమోషన్ చేసి, డిస్ట్రిబ్యూషన్ చేసి చివరికి రిలీజ్ చేసేదాకా నిర్మాత కష్టపడాలి. ఒకసారి నిర్మాత కష్టం అర్థమైతే హీరోలు కూడా అన్ని విషయాల్లోనూ వారికి సహకరిస్తారు.

ప్ర) నిర్మాతగా ఉండే టెంక్షన్ మీ నటన మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
జ) లేదు. అన్నింటినీ కథ ఓవర్ టేక్ చేస్తుంది. నా వరకైతే ఒక కథాపరమైన సినిమాకి నటుడు ఎలా ఉన్నాడు అనేది అవసరం లేదు. అందుకే ఫిజిక్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. గ్లామర్ కోసం కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోను. చాలా మంది అడుగుతుంటారు మీరు ఫిజిక్ ఎలా మైంటైన్ చేస్తుంటారని.

ప్ర) ఒక టెక్నీషియన్ కన్నా నటుడిగా పని చేయడం ఎలా ఉంది ?
జ) టెక్నీకల్ జాబ్ కన్నా నటన చాలా సులభం. అలా నటించడం కూడా ఒక గిఫ్ట్. నా వరకు నటించడమే ఈజీగా ఉంటుంది. పైగా అందరూ చాలా ఈజీగా గుర్తుపడతారు. నటుడిగా ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. అన్నీ టైంకి జరుగుతాయి. మంచి గౌరవం, మంచి ఆదాయం ఉంటాయి. మనం పర్సనల్ గా తెలీకపోయినా చాలా మంది మనల్ని ప్రేమిస్తారు. నేను గొప్ప నటుడ్ని కాను. అందుకే మంచి కథలు ఎంచుకుంటాను. అదే నాలోని మైనస్ పాయింట్స్ ని కవర్ చేస్తుంది.

ప్ర) ‘బిచ్చగాడు’ పెద్ద హిట్టై మంచి పెరిచ్చింది. దాంతో పాటు ఒత్తిడి ఏమైనా పెరిగిందా ?
జ) బిచ్చగాడు తెలుగు, తమిళంలో పెద్ద హిట్టైంది. మంచి పేరొచ్చింది. దాంతో పాటే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ నేను మాత్రం మారలేదు. ఒకసారి ఒక సినిమా మాత్రమే చేస్తాను. అందరి దగ్గరా డబ్బు తీసుకుని నేను ఇబ్బందిపడి వారిని ఇబ్బంది పెట్టను. ఎప్పటికీ ఒకేలానే ఉంటాను. డబ్బు గురించి పెద్దగా పట్టించుకోను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు