డిస్ట్రిబ్యూటర్స్ మాటతో సంతృప్తి చెందా : విక్రమ్

vikram
సౌతిండియన్ సినిమాలో ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలతో మెప్పించే వారిలో హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ‘ఇంకొక్కడు’ పేరుతో మరో ప్రయోగాత్మక సినిమాతో మన ముందుకొచ్చిన విషయం తెలిసిందే. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం ఫర్వాలేదనే టాక్ మాత్రమే తెచ్చుకున్నా, కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి వసూళ్ళు రాబడుతోంది. తెలుగులో ఈ సినిమాను నిర్మాత కృష్ణా రెడ్డి విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాగా ఆడుతోందని తెలియజేస్తూ నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ‘ఇంకొక్కడు’ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్‌లో పాల్గొన్న హీరో విక్రమ్ మాట్లాడుతూ.. “ఇంకొక్కడు సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా కష్టాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. తెలుగులో ఈ సినిమాను అంతా కొత్తవాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. వారంతా కలెక్షన్స్ బాగున్నాయని చెప్తూ ఉండడం సంతృప్తినిచ్చింది.” అని అన్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్‍లు హీరోయిన్లుగా నటించారు.