ఇంటర్వ్యూ: రుక్సార్ మీర్ – తెలుగులో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది !


తెలుగులో ‘షో టైమ్’ సినిమాలో హీరోయిన్ గా నటించిన రుక్సార్ మీర్ ఆ చిత్రం విడుదల కాకముందే రెండవ చిత్రం ‘ఆకతాయి’లో నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకానున్న సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
జ) నేను లండన్ లో పుట్టాను. తర్వాత మా నాన్న గోవాలో బిజినెస్ స్టార్ట్ చేయడంతో అక్కడికి మారిపోయాం. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం బెంగుళూర్ వచ్చాను. అక్కడే ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ప్రస్తుతం అక్కడే ఉంటున్నాను.

ప్ర) ఇది వరకు ఏయే సినిమాల్లో నటించారు ?
జ) నేను ఇప్పటిదాకా రెండు కన్నడ సినిమాల్లో నటించాను. అవి రెండు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి వినయ్ రాజ్ కుమార్ తో చేశాను. తెలుగులో నా మొదటి సినిమా ‘ఆకతాయి’.

ప్ర) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పాత్ర పేరు అనగ. కాలేజ్ అమ్మాయి. అప్పుడే అబ్రాడ్ నుంచి వచ్చి వైజాగ్లో ఉండే ఒక ఇండిపెండెంట్ అమ్మాయి లా ఉంటాను. ఈ సినిమాలో యాక్షన్, థ్రిల్, కామెడీ అన్నీ ఉంటాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

ప్ర) యాక్షన్ అంటున్నారు. మీరు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చేశారా ?
జ) లేదు పెద్దగా చేయలేదు. ఎందుకంటే ఇందులో అన్ని యాక్షన్ సీన్స్ ప్రీ ప్లాన్డ్ గా ఉంటాయి. అందుకే నేను ఎక్కువ యాక్షన్ సీన్స్ చేసే అవసరం రాలేదు.

ప్ర) మీ మొదటి తెలుగు సినిమా ఇంకా ఎందుకు రిలీజ్ కాలేదు ?
జ) నా ఫస్ట్ తెలుగు మూవీ ‘షో టైమ్’. డైరెక్టర్ కాంచిగారు. డీమానిటైజేషన్ కారణంగా రిలీజ్ కాలేదు. ఈ మార్చి నెలాఖరులో విడుదలవుతుంది. దానికంటే ‘ఆకతాయి’ ఫస్ట్ వస్తోంది కాబట్టి ఇదే నా డెబ్యూ సినిమా.

ప్ర) కన్నడ, తెలుగు పరిశ్రమల మధ్య తేడా ఏంటి ?
జ) రెండిటి మధ్య భాష తప్ప పెద్ద తేడా ఏం లేదు. రెండు పరిశ్రమలు నన్ను బాగానే ఆదరించాయి. తెలుగు ప్రేక్షకులు, ఇక్కడి మీడియా అందరూ నాకు సపోర్ట్ చేశారు. రెండు మంచి ఇండస్ట్రీలే. నాకు ఇక్కడ ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది.

ప్ర) ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారు ?
జ) నా గత చిత్రాల్లో నేను చేసిన పాత్రలన్నీ చాలా సీరియస్ గా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు. కానీ ఇందులో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. నాకు కథ కూడా బాగా నచ్చింది. టీమ్ కూడా చాలా మంచి వారు. ఈ పాత్ర నాకొక చేంజ్ లా అనిపించింది.

ప్ర) మీ డైరెక్టర్ రామ్ భీమన గురించి చెప్పండి ?
జ) డైరెక్టర్ చాలా మంచి వారు. ఆయన లండన్లో ఫిలిం స్టడీస్ చేశారు. చాలా అనుభవం ఉంది. మా నుండి ఏం కావాలో అయనకు బాగా తెలుసు. అందుకే ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా అనిపించింది. సినిమాని కూడా చాలా బాగా తీశారు.