
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్, సినిమా కోసం ఏమన్నా చేసే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 9న రిలీజ్ చెయ్యాలని డేట్ కూడా ఫిక్స్ చేసారు. ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, చైనీస్ లో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది.
ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయిన ఆడియో పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్ర టీం డిసెంబర్ 30న తెలుగు ఆడియో రిలీజ్ చేయనున్నారు. దానికోసం వేదికగా హైటెక్స్ లోని నవోతల్ ని ఎంచుకున్నారు. ఈ వేడుకకి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి అప్పటి వరకూ ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.
విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.