ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – నెంబర్ గేమ్ ను అస్సలు నమ్మను !


ఈ మధ్యే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో భ్రమరాంభగా మెప్పించిన రకుల్ ప్రీత్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి ‘జయ జానకి నాయక’ చిత్రంలో నటించింది. ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ సంగతులు మీకోసం…

ప్ర) చెప్పండి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) బోయపాటి శ్రీనుగారి నుండి వస్తున్న ఒక డిఫరెంట్ సినిమా ఇది. మంచి ప్రేమ కథ. దాంతో పాటే బోయపాటి మార్క్ యాక్షన్ కూడా ఉంటుంది.

ప్ర) ప్రేమ కథ అంటే ఎలాంటిది ?
జ) ఈ ప్రేమ కథలో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ఎంత కష్టం ఎదురొచ్చినా హీరో తన ప్రేమను వదులుకోడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి డీప్ లవ్ స్టోరీ రాలేదు. ఈరోజుల్లో అలాంటిది ఎవరూ చేయరు కూడ.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నా పేరు జానకి. చదువుకుంటూ సరదాగా, హాయిగా ఉండే నా జీవితంలో ఉన్నట్టుంది అనుకోని కష్టాలు ఎదురై అంతా తలకిందులైపోతుంది. చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాను. సినిమాలో చాలా వరకు డిప్రెషన్లో ఉండే క్యారెక్టర్.

ప్ర) ఎప్పుడూ ఏడుస్తూ ఉండే పాత్ర చేయడం కష్టమనిపించలేదా ?
జ) కొంచెం కష్టాంగానే ఉండేది. ఒకేసారి ఆ పాత్రలోకి వెళ్ళాక బయటికి రావడానికి టైమ్ పట్టేది. షూటింగ్ సమయంలో మా అమ్మ ఫోన్ చేసినా మాట్లాడేదాన్ని కాదు. ఒకవేళ మాట్లాడితే మళ్ళీ నార్మల్ మోడ్లోకి వచ్చేస్తానేమోనని అలా చేసేదాన్ని.

ప్ర) ఫిజికల్ గా ఏమైనా ఇబ్బంది పడ్డారా ?
జ) అంటే చాల సన్నివేశాల్లో ఏడుస్తూ ఉండాలి. అందుకోసం కళ్ళలో గ్లిజరిన్ వేసుకునేదాన్ని. షూటింగ్ అయ్యాక కూడా కళ్ళ నుండి నీళ్లు వచ్చేవి. అప్పుడు ఐస్ బ్యాగ్స్ కళ్ళ మీద పెట్టుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. (నవ్వుతూ) ఒక్కోసారి బోయపాటిగారితో సర్ షూటింగ్ అయ్యేలోపు కళ్ళ కింద లైన్స్ వస్తాయేమో అనేదాన్ని.

ప్ర) ఈమధ్య కాలంలో మిమ్మల్ని బాగా కదిలించిన ప్రేమ కథ ఏది ?
జ) ఈ మధ్య ‘నిన్ను కోరి’ చూశాను. అందులోని ప్రేమ కథ నన్ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.

ప్ర) బోయపాటి గారితో రెండవసారి వర్క్ ఎలా ఉంది ?
జ) బోయపాటిగారి స్టైల్ నాకు బాగా తెలుసు. ఆయనకు నటుల నుండి ఏం కావాలో, దాన్ని ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. అందుకే వర్క్ చాలా ఈజీగా ఉండేది. నేను పనిచేసిన ఇంటెలిజెంట్ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు.

ప్ర) మీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి చెప్పండి ?
జ) షూటింగ్ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఒకటే ఎనర్జీతో పనిచేసేవారు. బాగా కష్టపడేవారు. మంచివారు. ఆయనతో పనిచేయడం మంచి అనుభవం.

ప్ర) ఈ మధ్య నివేతా, సాయి పల్లవి లాంటి మంచి హీరోయిన్లు వచ్చారు. వాళ్ళ నుండి కాంపిటీషన్ ఫీలవుతున్నారా ?
జ) ‘నిన్ను కోరి’లో నివేత యాక్టింగ్ చూశాను. చాలా బాగా చేసింది. ‘ఫిదా’ చూడాలేదు కానీ సాయి పల్లవి గురించి చాలా మంది చెప్పారు. ఒకరి నుండి పోటీని ఎప్పుడూ ఫీలవను. అయినా తెలుగులోకి మంచి యాక్టర్స్ వస్తున్నారంటే సంతోషించదగిన విషయమే కదా.

ప్ర) మీరే ఇప్పుడు నెంబర్ వన్ అంటున్నారు. ఎలా ఉంది ?
జ) నేను నంబర్ గేమ్ నమ్మను. ఒకరు ముందు ఒకరు తర్వాత అనే దాన్ని అస్సలు పట్టించుకోను. అవసరం లేదు కూడా. రెండు సినిమాలు హిట్టయితే నెంబర్ వన్, ఫ్లాపైతే అవకాశాలు రావడంలేదు అనే మాటలు నిజం కాదు. అవకాశాలు ఉన్నంత వరకు సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే నా పని.

ప్ర) పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకున్నారని వార్తలొస్తున్నాయి ?
జ) లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇంకా సైన్ చేయలేదు. ఒకవేళ చేస్తే నేనే చెప్తాను.

ప్ర) తమిళం, హిందీ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు ?
జ) అలాంటిదేం లేదు. అన్ని సినిమాలు చేస్తున్నాను. నాకు తెలుగు, తమిళం అనే తేడా లేదు. ఎక్కడ మంచి సినిమాలు వచ్చినా చేస్తాను.