ఇంటర్వ్యూ: మిక్కి జె మేయర్ – మహేష్ బాబు మీద జోకులు వేయడం నచ్చలేదు !


‘హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఈ మధ్యే ‘అ..ఆ, శతమానం భవతి’ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్న సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందిన ‘మిస్టర్’ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానున్న సందర్బంగా మిక్కి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్ర) శ్రీను వైట్లతో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) శ్రీను వైట్లతో ఇదే నాకు మొదటి ప్రాజెక్ట్. ఆయన అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇపప్టి దాకా చాలా కమర్షియల్ సినిమాలు చేసిన ఈ చిత్రాన్ని మాత్రం ప్రత్యేకంగా తీశారు. ఇందులో ఆయన పాత స్టైల్ కనిపిస్తుంది.

ప్ర) సినిమా పాటల గురించి చెప్పండి ?
జ) సినిమాలో పాటలన్ని చాలా బాగా వచ్చాయి. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఇందులో కథకు ప్రాధాన్యమిచ్చి, దాని ప్రకారమే మ్యూజిక్ చేశాను. చాలా సెన్సిబుల్ మ్యూజిక్. చాలా మెలోడీగా ఉంటుంది.

ప్ర) వరుణ్ తేజ్ తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ?
జ) వరుణ్ తో నాకిది రెండవ సినిమా. మొదటి సినిమా ‘ముకుంద’ నుండి మాకిద్దరికీ మంచి స్నేహముంది. అతనొక రెగ్యులర్ స్టార్ లా కాకుండా మంచి స్నేహితుడిగానే ఉంటాడు. ఎప్పుడైనా సరే ఆయన్ను కలవొచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు.

ప్ర) మీరెప్పుడూ లైమ్ లైట్ లో ఉండరు ఎందుకు ?
జ) నాకు అలా ఉండటం ఇష్టముండదు. నాది హోమ్లీ లైఫ్ స్టైల్. పార్టీలకు, పబ్స్ కు అస్సలు వెళ్ళను. అందుకే నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువగా ఉంటారు. పైగా మొదట్లో నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే త్వరగా కలవలేకపోయా. ఇప్పటికీ ఈ సినిమా ప్రపంచం నాకు కొత్తగానే అనిపిస్తుంది.

ప్ర) ‘కొత్త బంగారు లోకం’ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. ఎందుకు ?
జ) ‘కొత్త బంగరు లోకం’ తర్వాత మా నాన్న గారికి ఆరోగ్యం దెబ్బతింది. మూడేళ్లు మంచం మీదే ఉన్నారు. దాంతో నేను కూడా ఎక్కువగా మ్యూజిక్ మీద దృష్టి పెట్టలేకపోయా. ఆయన 2011 లో చనిపోయారు. అందుకే ఆ గ్యాప్ వచ్చింది.

ప్ర) రహమాన్ తో పాడించాలని అనుకున్నారు ఏమైంది ?
జ) నా మొదటి సినిమా ‘లీడర్’ లోనే పాడించాలని అనుకున్నాను. అది ఇప్పటికీ కుదరలేదు. ఆ సినిమా సమయంలో ఆయన బిజీగా ఉండటం వలన పాడలేకపోయారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయనకు తగిన పాటలు దొరకలేదు.

ప్ర) మీ ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ?
జ) రహమాన్ గారంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చాలామందున్నారు. కానీ వాలా పాటలేవీ నేను పెద్దగా వినను. ఎందుకంటే ఎవరి పాటలైనా ఎక్కువగా ఉంటే మన మీద వాళ్ళ ప్రభావం పడుతుంది. మొదట్లో ‘హ్యాపీ డేస్’ పాటలు విని అందరు ఇది రహమాన్ సంగీతంలా ఉంది అన్నారు.

ప్ర) కీరవాణి గారు కొందరు దర్శకులతో పనిచేయడం కష్టం అన్నారు. మీకెప్పుడైనా అలా అనిపించిందా ?
జ) అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఫ్రస్ట్రేషన్ మాత్రమే. వాళ్లకు ఏం కావాలో వాళ్ళు చెబుతారు. మనం కూడా అది బాగుంటే చేస్తాం బాగా లేకపోతే బాగోలేదని చెప్తాం. ఎవరి సలహా అయినా సరే ముందు వినిపించుకునే ఓపిక ఉండాలి. అప్పుడే ఒక రాపో అనేది వస్తుంది.

ప్ర) బ్రహ్మోత్సవం సినిమా విషయంలో మీరెలా ఫీలవుతున్నారు ?
జ) నాకు మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల విషయంలో బాధనిపిస్తుంది. వాళ్లిద్దరూ ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దశ్యంతో చేశారు. కానీ అది ఫ్లాపైంది. దానికే చాలా మంది వాళ్లపై జోకులు వేయడం, ముఖ్యంగా మహేష్ బాబుగారిపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అస్సలు నచ్చలేదు. అందరూ ఒకే కుటుంబం. ఎప్పుడూ కలిసుండాలి. ఇలాంటివి తగ్గించాలి.

ప్ర) ఈ ‘మిస్టర్’ లో పాటమైనా పాడారా ?
జ) ఒక పాట పాడాను. అది కూడా అప్పటికప్పుడు నేను అనుకున్న సింగర్ అందుబాటులో లేకపోవడం వలన పడవలసి వచ్చింది. లేకపోతే పెద్దగా పాడను.