ఇంటర్వ్యూ : నాగార్జున – చిరంజీవిగారి రియాక్షన్ చూశాక నాకు టెన్షన్ పోయింది !

అక్కినేని నాగార్జున నిర్మతగా తనయుడు అఖిల్ తో చేసిన చిత్రమే ‘హలో’. సినిమా రేపు విడుదలవుతున్న సందర్బంగా నాగార్జునగారు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) అఖిల్ ప్రమోషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు ?
జ) అవును. ఎక్కడా కష్టం అనుకోకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. గత వారం నుండి యూఎస్ ప్రమోషన్స్ లో పాల్గొని ఆ వెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ చేసి, వాటి ప్రాక్టీస్ వలన చాలా అలసిపోయాడు. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ కి నేనొక్కడినే వచ్చాను.

ప్ర) ఈ సినిమా నిర్మించడం పట్ల ఎలా ఫీలవుతున్నారు ?
జ) అఖిల్ కి ఒక మంచి సినిమా చేశానని గర్వంగా ఫీలవుతున్నాను. అఖిల్ కూడా ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ లేచి కష్టపడ్డాడు. అతని కష్టం సినిమాలో కనిపిస్తుంది.

ప్ర) ఈ సినిమాలో మీరు చాలా ఇన్వాల్స్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్ ?
జ) స్క్రిప్ట్ ఫైనల్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరిగ్గా జరగడం చాలా ముఖ్యం. ఆ పనులు చూసుకోవడం నాకు ఇష్టం కూడ. మిగతా మొత్తం డైరెక్టర్ విక్రమ్ కుమార్ చూసుకున్నాడు.

ప్ర) మరి లొకేషన్స్ కి ఒక్కసారి కూడా వెళ్లలేదా ?
జ) ఒక్కసారి వెళ్ళాను. అది కూడా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ యాక్షన్ సీన్స్ తీసేప్పుడు వెళ్ళాను. అది కూడా మనకన్నా కొత్తగా అతనేం చేస్తాడో చూడాలనే వెళ్ళాను.

ప్ర) మరి ఆయన కొత్తగా ఏం చేశారు ?
జ) బాబ్ బ్రౌన్ హాలీవుడ్లో ఫెమస్ స్టంట్ కొరియోగ్రఫర్. పెద్ద పెద్ద సినిమాలకు పనిచేశారు. ఆయన కూడా ఒక ఇండియన్ సినిమాకి పనిచేయాలని అనుకుంటున్నాడనే విషయం తెలుసుకుని ఆయన్ను సంప్రదించాం. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని స్టంట్స్ ఈ సినిమాలో చూస్తారు.

ప్ర) సినిమాకి అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టారట నిజమేనా ?
జ) అవసరమైతే ఏ సినిమాకైనా పెడతాను. ఇక ఈ సినిమాకంటే అఖిల్ నా కొడుకు కాబట్టి ఎక్కువ ప్రేమతో కొంచెం ఎక్కువే పెట్టాను.

ప్ర) చిరంజీవిగారు సినిమా చూశారా ?
జ) చూశారు. ఈ విషయం ఎవరికీ తెలీదు. సినిమా చూసిన తరవాత ఆయన అఖిల్ ను రెండు నిమిషాల పాటు అలాగే కౌగిలించుకుని ఉండిపోయారు. ఆది చూసి నాక్కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన స్పందన తర్వాత నాలోని బరువు మొత్తం దిగిపోయింది.

ప్ర) ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన రావడం ఎలా ఉంది ?
జ) చాలా సంతోషంగా ఉంది. పిలవగానే వచ్చి ఆశీర్వదించారు. ఆయనతో పాటు మెగా అభిమానులు కూడా వచ్చారు. మేము మాట్లాడుతున్నప్పుడు మెగా ఫ్యాన్స్, చిరు మాట్లాడుతున్నప్పుడు అక్కినేని ఫ్యాన్స్ చప్పట్లు కొట్టడం చాలా బాగుంది. హెల్తీ వాతావరణంలో వేడుక జరిగింది.

ప్ర) అఖిల్ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్ అని ఎప్పుడనుకున్నారు ?
జ) ‘మనం’ తరవాత అఖిల్ ను లాంచ్ చేయమని విక్రమ్ కుమార్ ను అడిగాను. ఆయన కూడా సరే అన్నారు. కానీ సూర్యతో సినిమా ఉండటం వలన లేటైంది.

ప్ర) విక్రమ్ కుమార్ అఖిల్ ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు ?
జ) నేను అఖిల్ ను ఎలాగైతే చూడలనుకున్నానో అలాగే ప్రెజెంట్ చేశారు. అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. హిట్ క్రెడిట్ మొత్తం ఆయనకే వెళుతుంది.

ప్ర) రమ్యకృష్ణ, జగపతిబాబు పాత్రల గురించి చెప్పండి ?
జ) రమ్యకృష్ణను ఈ పాత్రను నువ్వే చేయాలని అని అడిగాను. ఆమె అడగ్గానే ఒప్పుకున్నారు. జగపతిబాబును ఈమధ్య విలన్ రోల్స్ లోనే చూస్తున్నారు. కానీ ఇందులో చూస్తే చాలా నచ్చేస్తాడు.

ప్ర) ఒక నిర్మాతగా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ?
జ) ఒక మంచి సినిమాను తీయడానికి ఏమేం చేయాలో అన్నీ మేం చేశాం. అందమైన చిత్రాన్ని మీకందిస్తున్నాం. మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటున్నాను.