సీనియర్ నటుడు నరసింహరాజు అప్పట్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం గురించి ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ‘ఆ రోజుల్లో నేను జానపద చిత్రాలకు పెట్టింది పేరు. విఠలాచార్య వంటి దర్శకులు నాతో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత నాకు మంచి సినిమాలు పడలేదు. దాంతో.. హీరోగా ఎక్కువ కాలం చేయలేకపోయాను’ అని ఆయన తెలిపారు.
నరసింహరాజు ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, నా కెరీర్లో దాసరి నారాయణరావు పాత్ర ఎంతో కీలకం. ఆయన దర్శకత్వంలో తూర్పు పడమర వంటి మూడు హిట్ చిత్రాలు చేశాను. ఆ తర్వాత, దాసరి గారి వ్యాపారాలను కూడా చూసుకున్నాను. దాసరి గారి ఎడిటింగ్ రూమ్‌లు ఉన్న ఒక భవనాన్ని గెస్ట్‌హౌస్‌గా అభివృద్ధి చేసి, రోజుకు 30-40 వేల రూపాయల లాభాలు రాబట్టాను. చిరంజీవితో పునాదిరాళ్లు చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నేను హీరో. చిరంజీవి విలన్. అప్పుడే, చిరంజీవి మంచి నటుడు అవుతారని, గొప్ప స్టార్‌గా ఎదుగుతారని నాకు తెలుసు’ నరసింహరాజు పేర్కొన్నారు.
