ఇంటర్వ్యూ : నాగార్జున అక్కినేని – సినిమా బాగా వచ్చింది కాబట్టే రిలీజ్ చేస్తున్నాను !

అక్కినేని నాగార్జున తన నిర్మాణ సారథ్యంలో కుమారుడు అఖిల్ తో చేసిన సినిమా ‘హలో’. ఈ నెల 22న సినిమా రిలీజ్ సందర్బంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ‘హలో’ పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది ?
జ) ‘హలో’ సినిమా టీజర్, ట్రైలర్, కొద్దిసేపటి క్రితమే విడుదలచేసిన వన్ మినిట్ సాంగ్ అన్నీ ఆడియన్సుకు బాగా నచ్చేశాయి. ట్రైలర్ అయితే 3, 4 డేస్ లోనే 8 మిలియన్ టచ్ అయింది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది.

ప్ర) మరి సినిమా ఆడియో ఎప్పుడు ?
జ) ఈ నెల 10న వైజాగ్లోని ఎంజిఎం గ్రౌండ్స్ లో ఆడియో వేడుక చేయాలని అనుకుంటున్నాం. చాలా గ్రాండ్ గా నిర్వహిస్తాం. ఇందులో స్వయంగా పాట పాడి డ్యాన్స్ కూడా చేయాలని అఖిల్ కు చెప్పాను. ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ప్ర) ఈ సినిమా ఎలా సెట్టైంది ?
జ) విక్రమ్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ఈ సినిమా లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. దాని మీద బాగా వర్క్ చేసి పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాకే షూట్ కి వెళ్లాం.

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) టీజర్ చూసి అందరూ ఇదొక యాక్షన్ సినిమా అనుకున్నారు. కానీ ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో మంచి మదర్, ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల వారికీ బాగా నచ్చుతుంది.

ప్ర) విక్రమ్ కుమార్ వర్క్ పట్ల సంతృప్తిగా ఉన్నారా ?
జ) విక్రమ్ కుమార్ తో వర్క్ నాకెప్పుడూ ఇష్టమే. ఈ సినిమాని చాలా శ్రద్ద పెట్టి జాగ్రత్తగా చేశాడు. ఆయన అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఇందులో కూడా చిన్న మ్యాజిక్ ఉంటుంది. అది స్క్రీన్ మీదే చూడాలి.

ప్ర) ఔట్ ఫుట్ చూశారా.. ఎలా ఉంది ?
జ) చూశాను. చాలా బాగా వచ్చింది. స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏదో అనుకున్నా కానీ స్క్రీన్ మీద చూస్తే ఆ స్క్రీన్ ప్లే అర్థమైంది. ఔట్ బాగా వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. అందుకే రిలీజ్ చేస్తున్నాను. సినిమా సరిగా రాకుండా ఉంటే రిలీజ్ చేసేవాడినే కాదు.

ప్ర) హీరోయిన్ గురించి చెప్పండి ?
జ) హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి నా ‘నిర్ణయం’ సినిమా తీసిన దర్శకుడు ప్రియదర్శి కూతురు. నిజానికి ఆమె తల్లి లీసాను అప్పట్లో నాతోనే లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆమె కూతురు నా కుమారుడితో లాంచ్ అవుతోంది. అమ్మాయి నిజంగా చాలా బాగా చేసింది.

ప్ర) సినిమాలో హైలెట్స్ ఏంటి ?
జ) సినిమాలో స్టంట్స్ కొత్తగా ఉంటాయి. వాటి కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను తీసుకొచ్చాం. ఒక ఫైట్ అయితే మొత్తం కృష్ణా నగర్ ఇళ్ల మీదే ఉంటుంది. ఇంకొకటి మెట్రో ట్రైన్లో ఉంటుంది. కొత్తగా ఉంటాయి. కొని చోట్ల జాకీ చాన్ స్టంట్స్ గుర్తొస్తాయి.

ప్ర) సినిమా కథ ‘మనం’ లా కాంప్లికేటెడ్ గా ఏమైనా ఉంటుందా ?
జ) అంటే అందులో చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి. కానీ అన్నీ స్క్రీన్ ప్లేలో రివీల్ అవుతూ ఉంటాయి. అందరికీ చక్కగా అర్థమవుతుంది. ఇందులో కథ పొద్దున్న 7:30 కి మొదలై సాయంత్రం 5:30 కి ముగిసిపోతుంది.

ప్ర) టైటిల్ ‘హలో’ కి పూర్తి అర్థమేమిటి ?
జ) అంటే హీరోయిన్ విడిపోయేప్పుడు హీరోకి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళుతుంది. కానీ హీరో ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తదు. అలా హీరో 15 ఏళ్ల పాటు ఆమె నోటి నుండి హలో అనే పదం వినాలని ఎదురుచూస్తూ ఉంటాడు. అందుకే ఆ టైటిల్ పెట్టాం.

ప్ర) ‘మనం’ సినిమాకి నది అవార్డు రాకపోవడం సరికాదని అందరూ అంటున్నారు. మీ స్పందన ఏంటి ?
జ) సినిమాకు ప్రేక్షకులంతా తమ గుండెల్ని ఇచ్చారు. అంతకు మించిన అవార్డులు ఏముంటాయ్. అవి చాలు మాకు.