ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: కె. బసి రెడ్డి – ఆస్కార్ అవార్డ్ గెలవగల సినిమా తీయడమే నా లక్ష్యం !


ఇండియన్ సినిమాకు డిజిటల్ మేకింగును పరిచయం చేసి సినిమా నిర్మాణ రంగ రూపురేఖల్ని మార్చేసిన వ్యక్తి, డిజిక్వెస్ట్ అధినేత కె. బసి రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఏటీఎం వర్కింగ్’. రేపు మార్చి 17న చిత్రం రిలీజవుతున్న సందర్బంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) మీ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది ?
జ) నేను అమెరికాలోని క్యాలిఫోర్నియాలో పనిచేసేవాడిని. 1993లో జియో గ్రాఫికల్ ఇంఫర్మేషన్ సిస్టమ్స్ మీద పనిచేశాను. ఆ తర్వాత 1994లో యానిమేషన్ ఫిలిమ్స్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి ఇలా సినీ రంగంలోకి అడుగుపెట్టాను.

ప్ర) డిజిటల్ మేకింగ్ ను ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకనిపించింది ?
జ) డిజిటల్ మేకింగ్ తో సినిమా నిర్మాణం చాలా సులభతరం. టెక్నీకల్ గా చాలా వెసులుబాటు ఉంటుంది. సినిమా రూపొందించాలనుకునే వాళ్లకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఒక రకంగా అందరికీ స్వతంత్యం దొరికినట్టే. సినిమా చేయాలంటే ఒకరిని నమ్ముకోవాల్సిన పని లేదు. టాలెంట్ ఉన్నవాళ్లు ఎవరైనా సరే సినిమా చేయవచ్చు.

ప్ర) డిజిటల్ మేకింగ్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో ఎలాంటి ఇబ్బదులు పడ్డారు ?
జ) చాలా ఇబ్బందులనే చూశాను. చాలా మంది ఎందుకు నీకిదంతా అని ప్రశ్నించారు. నా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. చాలా నష్టపోయాను కూడా. అయినా చేయాలనుకున్నాను చేశాను.

ప్ర) ఇప్పుడు చాలా సినిమాలకు మీరు తీసుకొచ్చిన టెక్నాలజీనే వాడుతున్నారు ఎలా ఫీలవుతున్నారు ?
జ) చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం రూపొందే ప్రతి డిజిటల్ చిత్రం నేను కష్టపడి తీసుకొచ్చిన టెక్నాలజీ మూలంగానే రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాసెస్ లో నేను నష్టపోయినా అన్నిటికన్నా విలువైన సంతృప్తి నాకు దొరికింది.

ప్ర) తెలుగులో మీరు ఏయే ప్రాజెక్ట్స్ చేశారు ?
జ) తెలుగులో నేను డిజిటల్ టెక్నాలజీని ఉపయీగించి మొదటి చేసిన చిత్రం ‘సొంత ఊరు’. ఆ సినిమాకు నాలుగు నంది అవార్డులు వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ లో ‘7 డేస్ ఇన్ స్లో మోషన్’ అనే సినిమా చేశాను. దానికి 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ చేశాం. ఇప్పుడు ఈ ‘ఏటీఎం వర్కింగ్’ చేశాం.

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా పూర్తిగా డీమానిటైజేషన్ వలన తలెత్తిన వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది. కరెన్సీ బ్యాన్ సమయంలో సామాన్యుల దగ్గర్నుంచి ప్రతి ఒక్కరు ఎలా ప్రభావితం అయ్యారు అనే దానిని కాస్త హాస్యంగా చూపిస్తాం.

ప్ర) ఈ సినిమాకి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పిందని విన్నాం ?
జ) అవును..మొదట ఏటీఎం నాట్ వర్కింగ్ అనే టైటిల్ పెడితే సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది అందుకే దాన్ని ఏటీఎం వర్కింగ్ అని మార్చవలసి వచ్చింది. ఇక సినిమాలో అక్కడక్కడా ప్రస్తావించిన కొన్ని రాజకీయపరమైన అంశాలను కూడా తొలగించాల్సి వచ్చింది.

ప్ర) ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నారు ?
జ) ఈ సినిమా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు దొరక్కపోతే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ బుర్రలో క్రిమినల్ థాట్స్ ఎలా పుడతాయి, అసలు ఈ నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి అనేది చూపిస్తాం.

ప్ర) ఈ సినిమాని ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ?
జ) అన్ని ఏరియాల్లో కలిపి సుమారు 40 – 45 థియేటర్ల వరకు రిలీజ్ చేస్తున్నాం. మార్చి 17న విడుదలవుతుంది.

ప్ర) దర్శకుడు సునీల్ రెడ్డికి, మీకు మధ్య అంత మంచి రాపో ఎలా వచ్చింది ?
జ) సునీల్ రెడ్డి చాలా మంచివారు. ఆయనతో కలిసి మొదటి సినిమా నుండి పని చేస్తున్నా. నా ఆలోచన విధానం, ఆయన ఆలోచన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే మా ఇద్దరికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.

ప్ర) ఈ సినిమా థాట్ ఎలా వచ్చింది ?
జ) ఒకసారి గోవా ఏటీఎంల ముందు క్యూల్లో నించుని ఉండటం, కొన్ని చోట్ల ఏటీఎం నాట్ వర్కింగ్ అనే బోర్డు కనిపించడం చూసి జనాలంతా ఎక్కువగా ఏటీఎంల వద్దే ఉంటున్నారు కనుక అక్కడే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ సెట్ చేసి డీమానిటైజేషన్ టాపిక్ ద్వారా సినిమా తీయాలని అనుకున్నాం.

ప్ర) ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనుకుంటున్నారు ?
జ) ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫైనల్ కాపీ చూశాను. చాలా బాగా వచ్చింది. మంచి హాట్ టాపిక్ కాబట్టి అందరినీ ఆకర్షిస్తుంది.

ప్ర) మీ ఫ్యూచర్లో ఎలాంటి సినిమా టీడదామని అనుకుంటున్నారు ?
జ) నాకు డిజిటల్ మేకింగ్ అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పటికైనా ఆస్కార్ అవార్డ్ సాధించగల ఒక యానిమేటెడ్ సినిమా తీయాలని ఉంది. ప్రస్తుతం ఆ పనులే జరుగుతున్నాయి. తప్పకుండా తీస్తాను.