ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – నాకు కథ సెట్టవుతుంది అనిపిస్తేనే ఏ సినిమా అయినా చేస్తాను !

ఇటీవలే ‘మెంటల్ మదిలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో శ్రీ విష్ణు అందరి మెప్పు పొందారు. ఈ చిత్రంతో ఆయన ఖాతాలో మరొక విజయం కూడా నమోదైంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
జ) సక్సెస్ ఎప్పుడైనా బాగుంటుంది. నాకు అలాగే ఉంది. ఒక నటుడికి చేసిన పనికి ప్రోత్సాహం లభిస్తేనే ఆనందంగా ఉంటుంది. నా అన్ని సినిమాల్లోకి దీనికే థియేటర్లో ఉండగానే ఎక్కువ డబ్బులు వచ్చాయి.

ప్ర) ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్టైంది ?
జ) ‘అప్పట్లో ఒకడుండేవాడు’ రిలీజ్ టైంలో రాజ్ కందుకూరి వివేక్ ను నా దగ్గరకి పంపారు. కథ మొదటి 10 నిముషాలు వినగానే ఒప్పేసుకున్నాను.

ప్ర) రియల్ లైఫ్లో అనేకమైన ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారా ?
జ) లేదు. లైఫ్లో ఖచ్చితమైన నిర్ణయాలే తీసుకుంటాను. నాకు ఏది సరిపోతుందో దాన్నే చూజ్ చేసుకుంటాను. ఒకవేళ స్క్రిప్ట్ బాగుంది నాకు సెట్టవ్వకపోతే నేను చేయను. అది నా పాలసీ. ఏదైనా నాకు నచ్చి, సెట్టవుతుంది అనిపిస్తేనే చేస్తాను.

ప్ర) సినిమా చూసిన మీ ఫ్రెండ్స్ ఏమన్నారు ?
జ) ఫస్ట్ చూసింది నారా రోహితే. చూసి చాలా బాగుందన్నారు. గెస్ట్ రోల్ కూడా అడగ్గానే చేసేశాడు.

ప్ర) సెలబ్రిటీస్ కూడా చూశారు కదా ఏమన్నారు ?
జ) అందరూ మెచ్చుకున్నారు. రెగ్యులర్ స్టోరీ కాదు, స్క్రీన్ ప్లేలో చిన్న మ్యాజిక్ ఉంటుంది. చిన్న పాయింట్. ఇందులో నచ్చదు అనడానికి ఏమీ ఉండదు. సింపుల్ గా ఉంటుంది. కొంతమందికి విపరీతంగా నచ్చేసింది.

ప్ర) ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది ?
జ) ప్రీమియర్స్ దగ్గర్నుంచి ఆడియన్స్ తో కలిసి సినిమా చూస్తూనే ఉన్నాను. వాళ్ళ స్పందన ఆరంభం నుండి బాగానే ఉంది. ముఖ్యంగా నాకు, శివాజీరాజాగారికి మధ్య వచ్చే సీన్లు, హీరోయిన్లతో నా లవ్ ట్రాక్స్ వాళ్ళను బాగా ఎట్రాక్ట్ చేశాయి.

ప్ర) ఇద్దరు హీరోయిన్లతో నటించడం మొదటిసారి కదా ఎలా అనిపించింది ?
జ) నేను హీరోయిన్లతో తక్కువ మాట్లాడతాను. ఇంతకూ ముందు చేసింది నార్త్ హీరోయిన్లు కాబట్టి పెద్దగా సింక్ కుదిరేది కాదు. కానీ ఇప్పుడు చేసింది దక్షిణాది హీరోయిన్లే కాబట్టి చాలా ఈజీగా అనిపించింది. వాళ్ళ వలనే బాగా నటించగలిగాను.

ప్ర) స్క్రిప్ట్ విషయంలో మీరేమైనా మార్పులు చేబుతారా ?
జ) రాసేవాళ్ళు రాసేటప్పుడు ప్రేమించి రాసుకుంటారు. అందరం గ్రూప్ లా డిస్కషన్స్ పెట్టుకునే చేంజెస్ చేసుకుంటాం.

ప్ర) భవిష్యత్తులో ఎలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు ?
జ) పలానా స్క్రిప్ట్స్ చేయాలనేం లేదు. డైరెక్టర్స్ చెప్పేటప్పుడు నాకు నచ్చితే ఏ కథైనా వెంటనే ఓకే చేస్తాను.

ప్ర) మీ నెక్ట్స్ సినిమాలేంటి ?
జ) ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే అసుర డైరెక్టర్ విజయ్ తో ‘తిప్పరా మీసం’ అనే సినిమా చేస్తున్నాను. ‘వీర భోగ వసంతరాయలు’ కూడా షూటింగ్లో ఉంది.