కొరటాల శివకు ఎప్పటికీ ఋణపడి ఉంటా : ఎన్టీఆర్

ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ‘జనతా గ్యారేజ్’ అన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత కొరటాల శివ అందించిన ఈ హ్యాట్రిక్ హిట్ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జనతా గ్యారేజ్ టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. తమకు ఇంతటి విజయాన్ని తెచ్చిపెట్టిన అభిమానులకు థ్యాంక్స్ తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ మీట్‌లో ఎన్టీఆర్, సమంత, కొరటాల శివ సహా టీమ్ అంతా పాల్గొంది.

ఇక ఈ సందర్భంగానే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “జనతా గ్యారేజ్ సక్సెస్ చూశాక మాటలు లేవు. కొన్ని సార్లు అనుభూతులు తప్ప చెప్పడానికి మాటలు దొరకవు. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదలైంది. సెప్టెంబర్ 2న మా అమ్మా, నాన్నల పుట్టినరోజు. ఈ విజయంతో నా 12, 13 ఏళ్ళ తపనను అమ్మా, నాన్నలకు చూపించగలిగా. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకిచ్చిన కొరటాల శివకు ఎప్పటికీ ఋణపడి ఉంటా. అదేవిధంగా నా కెరీర్‌కే అతిపెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకుల ప్రేమనూ ఎప్పటికీ గుర్తుంచుకుంటా.” అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంతతో పాటు నిత్యా మీనన్ మరో హీరోయిన్‌గా నటించారు.