ఫ్రెంచ్‌లోకి డబ్ కానున్న ‘ప్రేమమ్’..!

premam
‘ప్రేమమ్’.. సమ్మర్ కానుకగా గతేడాది విడుదలైన ఈ మళయాల సినిమా కేరళలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మళయాల సినీ పరిశ్రమ రికార్డులన్నింటినీ తిరగరాసిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒక యువకుడి అందమైన ప్రేమకథలను అంతే అందంగా చెప్పిన ఈ సినిమాకు ఒక్క కేరళలోనే కాక, తెలుగులోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా అభిమానులు ఇష్టపడే ఒక వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది.

అదే ఫ్రెంచ్‍లోకి ఈ సినిమా డబ్ కానుండడం. ఓ ప్రముఖ ఫ్రెంచ్ ప్రొడక్షన్ సంస్థ ఇందుకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఫ్రెంచ్ సినిమాకు ప్రపంచ సినిమాలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి భాషలోకి తమ సినిమా డబ్ అవుతున్నందుకు ప్రేమమ్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సినిమాను యంగ్ హీరో నాగ చైతన్య ప్రేమమ్ పేరుతోనే తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘ప్రేమమ్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.