తన పాటలు పాడకూడదంటూ నోటీసులు పంపిన ఇళయరాజ !


ఎప్పుడూ సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు కోపమొచ్చింది. తన పాటలు పాడకూదంటూ కోర్ట్ నోటీసులు కూడా పంపారు. వివరాల్లోకి వెళితే తన సొంత ట్యూన్స్ ఇతరులు కాపీ చేస్తుండటంతో ఇళయరాజా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు తన కంపొజిషన్స్ తన అనుమతి లేకుండా పాడకూడదని నోటీసులు పంపారు. ఈ విషయంపై స్పందించిన బాలసుబ్రమణ్యం తన ఫేస్ బుక్ ద్వారా స్పందించారు.

‘నాకు రెండు ఇళయారాజా వద్ద నుండి లీగల్ నోటీసులు అందాయి. అందులో వివిధ దేశాల్లో శ్రీమతి చిత్ర, చరణ్ లు నిర్వహిస్తున్న కచేరీల్లో తన కంపొజిషన్స్ పాడకూడదని, ఆలా చేస్తే కాపీ రైట్స్ ని అతిక్రమించినందుకుగాను భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్పీబీ50 పేరుతో మా అబ్బాయి ఈ టూర్ ప్లాన్ చేశారు.

నేను ఇప్పటి వరకు రష్యా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఎన్నో కచేరీలు చేశాను. అప్పుడు రాని నోటీసులు అమెరికాలో కచేరీ అనగానే వచ్చాయి. ఆయన చెప్పారు కాబట్టి యూఎస్ టూర్లో ఆయన పాటలను ఆలపించను. కానీ కచేరీ మాత్రం అనుకున్న ప్రకారమే జరుగుతుంది. నేను నా మంచి మిత్రుడు ఇళయరాజాను ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాను’ అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.