‘బాహుబలి’పై ప్రముఖ వ్యాపారవేత్త ప్రశంసల వర్షం!

baahubali
ప్రతి సినీ అభిమానీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూసిన సినిమా ‘బాహుబలి’ ఎట్టకేలకు గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మూడేళ్ళుగా ఎదురుచూసాక వచ్చిన ఓ ప్రతిష్టాత్మక సినిమా థియేటర్లలో పడితే ఎలా ఉంటుందో ‘బాహుబలి’ మొదటి వారాంతం కలెక్షన్లు నిరూపించి చూపాయి. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుండీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల హంగామా ఇలా ఉంటే.. బాహుబలి సినిమాకు కేవలం సినీ నేపథ్యానికి సంబంధించిన ప్రముఖుల నుంచే కాక రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖుల నుంచి కూడా విశేషం స్పందన రావడం గమనార్హం. ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. బాహుబలి సినిమాను చూసిన ఆయన ట్విట్టర్‌లో ఈ సినిమాపై ప్రశంసలు గుపించారు. “బాహుబలి ఇండియన్ సినిమాలో ఒక అద్భుతమైన ప్రగతి. గ్రాఫిక్స్ వర్క్, సినిమా స్థాయి చూశాక ఇండియన్ సినిమా కథను, స్థాయిని తెలిపిన సినిమాగా కనిపిస్తోంది. అయితే దీన్ని హాలీవుడ్ సినిమాతో పోల్చకూడదు. భారతీయ డీఎన్‌ఏ కలిగి ఉన్న ప్రత్యేకమైన సినిమా బాహుబలి” అంటూ బాహుబలి సినిమాపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించగా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.

Exit mobile version