ఇంటర్వ్యూ : బాలకృష్ణ – సినీ పరిశ్రమలో నేను తరచూ కలిసేది చిరంజీవినే!

balakrishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదల రోజునుంచే హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. అదిరిపోయే కలెక్షన్స్‌తో బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా సినిమా నిలవనున్న నేపథ్యంలో ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా.. సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

స) సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం నిజంగానే చాలా సంతోషకరం. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల విజయంగా చూస్తా. ప్రేక్షకులంతా ఇది మన తెలుగు సినిమా అంటూ సినిమాను తమదిగా చేసుకొని ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టడం మర్చిపోలేనిది. మీడియా కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.

ప్రశ్న) సినిమా చూసినవాళ్ళంతా మీరు తప్ప మరొకరు శాతకర్ణి పాత్రలో నటించలేరు అన్నపుడు ఏమనిపిస్తుంది?

స) అది ప్రేక్షకులిచ్చే తిరుగులేని అభినందనగా చూస్తా! నాన్నగారికి ఉన్న ఇమేజ్ వల్ల అందరూ అలా అనుకొని ఉంటారనుకుంటా. నాన్నగారు (నందమూరి తారకరామారావు) గారి దగ్గర్నుంచి, నావరకూ ఇలాంటి పాత్రలు చేయడాన్ని ఒక అదృష్టంగా భావిస్తూంటాం. అదేవిధంగా సినిమా చేస్తున్నన్ని రోజులూ నాన్నగారు నా వెన్నంటే ఉండి నడిపించినట్లు ఉండేది.

ప్రశ్న) శాతకర్ణిని మీ వందో సినిమాగా ఒప్పుకునేంతగా ఏం నచ్చింది?

స) క్రిష్ నాకు ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడే పక్కా క్లారిటీతో ఉన్నాడు. ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చేస్తాం, ఎక్కడెక్కడ షూట్ చేస్తాం, రిలీజ్ డేట్ ఏంటీ? ఇలా అన్ని పకడ్బందీగా డిజైన్ చేసుకున్నాదు. నాకొక పూర్తి స్థాయి సినిమా కళ్ళముందు ఉన్నట్లనిపించింది. అదేవిధంగా వందో సినిమాగా ఇలా హిస్టారికల్ డ్రామా చేసే అవకాశం అంత సులువుగా రాదు. ఆ రకంగానూ ఇదో అదృష్టంగా భావించి వెంటనే ఒప్పేసుకున్నా.

ప్రశ్న) ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఒక సినిమా అంటే రిస్క్ అనిపించలేదా?

స) మొదట్నుంచీ ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకం ఉండింది. నిజానికి కథగా మాకు పూర్తి స్థాయి సినిమాకు సరిపడే అంశాలు లేకపోయినా, క్రిష్ తెలివిగా తెలిసిన అంశాలతోనే సినిమాగా మలచడంలో చూపిన ప్రతిభతో నా నమ్మకం రెట్టిపైంది.

ప్రశ్న) సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళక ముందు ఎలాంటి ప్రిపరేషన్స్ చేశారు?

స) శాతకర్ణి గురించి చరిత్రలోనూ తక్కువ విషయాలే ఉన్నాయి. దీంతో మేము తెలిసిన సంఘటనలతోనే కథ తయారుచేయాలి. ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్, నేను, టీమ్ అంతా చాలా చర్చలు చేసి ఒక పక్కా స్క్రిప్ట్‌ను ముందే తయారుచేయగలిగాం. ఇక సెట్లో క్రిష్ ఒక సన్నివేశం చెప్పగానే ఎక్కడిలేని ఉత్సాహం వచ్చేది. అదే ఉత్సాహంతో నటించేవాడిని.

ప్రశ్న) ఫిజికల్‌గా ఈ పాత్ర కోసం మీరెలా కష్టపడ్డారు?

స) నావరకూ ఫిట్‌నెస్ అంటే ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ గంటలు పనిచేసే శక్తికలిగి ఉండడం. ఇక సిక్స్‌ప్యాక్, బాడీ బిల్డింగ్ లాంటివి నేను పెద్దగా పట్టించుకోను. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ నేనేదైనా ప్రయత్నించినా అందరూ నవ్వుతారు. ఇవన్నీ అలా ఉంచితే, ఇలా సిక్స్‌పాక్‌లు ఇవన్నీ మన కల్చర్ కాదు. సహజంగా ఉండడాన్నే మనవాళ్ళు ఇష్టపడతారు.

ప్రశ్న) క్రిష్‌కు మీరెలాంటి సలహాలిచ్చేవారు?

స) కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యేలా సినిమా ఉండేలా చూసుకోమని సలహా ఇచ్చా. అదేవిధంగా అనవసరమైన కామెడీ అస్సలు వద్దని కూడా చెప్పా. ఇక షూటింగ్ సమయంలో నాకేదైనా అనిపిస్తే క్రిష్‌తో డిస్కస్ చేస్తూండేవాణ్ణి.

ప్రశ్న) సంక్రాంతి సినిమాల మధ్య పోటీ అంటూ పోయిన వారమంతా కనిపించిన హడావుడిని ఎలా చూస్తారు?

స) నన్నడిగితే ఆరోగ్యకర పోటీ ఉండడంలో తప్పు లేదు. పోటీ ఉంటేనే మనం ఎలాంటి సినిమా చేయాలన్న విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఇక ఈసారి చిరంజీవి గారి సినిమా, నా సినిమా ఒకేసారి వచ్చాయి. ఇండస్ట్రీలో నేను ఎవరితోనైనా ఎక్కువగా కలుస్తానంటే అది చిరంజీవితోనే! మా ఇద్దరి సినిమాలూ బాగా ఆడడం సంతోషంగా ఉంది.

ప్రశ్న) ఇతర హీరోలు ఎవరితో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటారు?

స) నేను పెద్దగా ఎవ్వరితోనూ కలవను. నా పనుల్లో నేను బిజీగా ఉంటా. క్యాన్సర్ హాస్పిటల్ చూస్కోవాలి, ఇప్పుడు ఎమ్మేల్యేను కూడా కాబట్టి మరికాస్త బిజీ అయిపోయా.

ప్రశ్న) ‘రైతు’ సినిమా గురించి చెప్పండి?

స) రైతు ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. కృష్ణవంశీ రాసిన ఆ కథ చాలా బాగుంటుంది. అందులో ఒక బలమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ గారిని కలిశాం. ఆయన ఒప్పుకుంటేనే ఈ సినిమా ఉంటుంది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.

ప్రశ్న) మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు?

స) మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఈ ఏడాది చివరికల్లా మొదలవుతుంది. శాతకర్ణి సినిమాకు మోక్షజ్ఞ, క్రిష్‌ డైరెక్షన్ టీమ్‌లో పనిచేశాడు. ప్రస్తుతం హీరో అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

ప్రశ్న) మోక్షజ్ఞను లవర్‌బాయ్‌గా చూడొచ్చా?

స) మా ఫ్యాన్స్ ఒప్పుకోరేమో!! (నవ్వుతూ..) ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ అనుకోలేదు కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేను. ఇకపోతే నేను, మోక్షజ్ఞ కలిసి ఆదిత్య 999 అనే సినిమాలో మాత్రం కలిసి నటిస్తాం. ఆ సినిమాకు స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది.

ప్రశ్న) మిమ్మల్ని చూస్తే అందరూ భయపడుతుంటారు ఎందుకని?

స) నాకూ అదే విషయం అర్థం కాదు. నేనైతే అందరితో సరదాగా మాట్లాడతా, అందరిలానే ఉంటా. మరి నేను సినిమాల్లో చేసే పాత్రల ప్రభావం వల్ల నన్ను చూసి నిజ జీవితంలోనూ అలాగే ఉంటాననుకుంటారేమో!

ప్రశ్న) మల్టీస్టారర్ సినిమాలు చేస్తారా?

స) మల్టీస్టారర్స్ చేయడానికి నాకెలాంటి ఇబ్బంది లేదు. చేయబోయే పాత్ర నచ్చితే కచ్చితంగా మల్టీస్టారర్స్ చేస్తా. నిజానికి నాకు కూడా ఒక ఐడియా ఉంది. త్వరలోనే ఆ ఐడియాను ఒక హీరోతో చెప్తా!