ఇంటర్వ్యూ : ‘నాగచైతన్య’ – ఎల్లప్పుడూ తనతో కృతజ్ఞతతో ఉంటాను.

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా రాబోతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. కాగా కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ‘నాగచైతన్య’ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

అసలు ఈ ‘సవ్యసాచి’ ప్రాజెక్ట్ ఎలా పట్టాలెక్కింది ?

నార్వేలోని ప్రేమమ్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఫస్ట్ చందు నాకు ఈ ‘సవ్యసాచి’కి సంబంధించిన స్టోరీ లైన్ చెప్పాడు. వినగానే ఎందుకో నాకు బాగా నచ్చేసింది. అయితే కథలో మెయిన్ పాయింట్ చాలా ఆసక్తికరమైనది అయినప్పటికీ, ఎక్కడో చిన్న టెన్షన్.. ఇత్త వైవిధ్యమైన పాయింట్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం అయితే ఉంది. బట్ ఒకసారి చందు ఫుల్ స్క్రిప్టు రాసుకొని వచ్చి.. ఎప్పుడైతే చెప్పాడో.. వెంటనే నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నాను. అలా మా సవ్యసాచి స్టార్ట్ అయింది.

‘సవ్యసాచి’ కథలో చాలా వైవిధ్యమైన పాయింట్ ఉందన్నారు. దాని గురించి చెప్పండి ?

అది సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఓ వ్యక్తి శరీరంలో ఓ భాగం అయిన చెయ్యి తన ఆదీనంలో లేకపోతే.. ఆ చెయ్యి తనకు సహకరించకపోతే.. ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి ? దీనికి తోడు ఆ హ్యాండ్ కి అపారమైన శక్తి ఉంటే.. ఇలాంటి పలు అంశాలతో ఈ కధకు చందు అద్భుతమైన ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే రాశాడు. మొదట్లో, ఈ సినిమా మేకింగ్ సమయంలో ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వస్తోందో అని చాలా భయపడ్డాను. కానీ ఒకటి రెండు షెడ్యూల్స్ అయిపోయాక ఇక ఈ సినిమా పై నాకు చాలా నమ్మకం పెరిగింది.

మైత్రి మూవీస్ తో కలిసి పని చెయ్యడం ఎలా అనిపించింది ?

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మైత్రి మూవీస్ లోకి ఎంటర్ అయిందో.. అప్పుడే ఈ సినిమా సగం హిట్ అయిపోయినట్లు. ఎందుకంటే ఈ బ్యానర్ ఎప్పుడూ కథకు ప్లస్ అవుతుంది అండి. అందుకే కీలక పాత్రల్లో మాధవన్ మరియు భూమిక వంటి నటినటులను పెట్టారు. సినిమా గురించి వారి ఆలోచన ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా ఇంత హైప్ వచ్చిందంటే దానికి మైత్రి మూవీసే కారణం.

చందు మొండేటి దర్శకత్వంలో మీరు ఇంతకుముందే ఓ సినిమా చేశారు. మళ్లీ రెండో సారి చేస్తున్నారు. ఎలా అనిపించింది ?

ప్రేమమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందంటే.. దానికి చందు డైరెక్షనే మెయిన్. తను ఎవరితోనైనా పనిచేయగలడు, పని చేయించుకోగలడు. ఇక రెండోసారి తనతో పని చెయ్యడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్క్రిప్ట్ తో తను మళ్ళీ నా దగ్గరకు వచ్చినందుకు తనకి థాంక్స్ చెప్పాలి. ఎల్లప్పుడూ తనతో కృతజ్ఞతతో ఉంటాను.

ఈ సినిమాకి కీరవాణిగారు సంగీతం అందించారు. ఆయన గురించి చెప్పండి ?

ఆయన ఈ సినిమాకి పని చెయ్యడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయన గొప్ప సంగీత విద్వాంసుడు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. సెకెండాఫ్ లో ఈ సినిమా చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది, దానికి కారణం కీరవాణిగారు ఇచ్చిన నేపధ్య సంగీతమే. అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి.

‘శైలజారెడ్డి అల్లుడు’కి మిశ్రమ ప్రతిస్పందనను వచ్చింది. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ?

నేను హ్యాపీగా ఉన్నాను, కానీ ‘శైలజారెడ్డి అల్లుడు’ కొంత నిరాశ పరిచిన మాట వాస్తవం. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమా అది. బట్ చాలామంది ప్రేక్షకులకి ఆ సినిమా నచ్చలేదు. ఇప్పుడు సవ్యసాచి సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను

మీ తదుపరి ప్రాజెక్టులు గురించి చెప్పండి ?

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటిస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. అలాగే ‘వెంకీ మామ’ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

Exit mobile version