ఇంటర్వ్యూ : చిరంజీవి – ఆ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే ఇవ్వాలి!

ఇంటర్వ్యూ : చిరంజీవి – ఆ క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే ఇవ్వాలి!

Published on Jan 9, 2017 2:56 PM IST

chiru
మెగాస్టార్ చిరంజీవి.. బాక్సాఫీస్ వద్ద లెక్కలేనన్ని సార్లు ప్రభంజనం సృష్టించిన పేరు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే తిరుగులేని కమర్షియల్ హిట్స్ ఇచ్చిన ఈ స్టార్ 2007 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. శంకర్‌దాదా జిందాబాద్ అనే సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన చిరు, మళ్ళీ ఇన్నేళ్ళకు ‘ఖైదీ నంబర్ 150’తో మెప్పించేందుకు సంక్రాంతి కానుకగా జనవరి 11న వచ్చేస్తున్నారు. చిరు నటించిన 150వ సినిమా కావడం వల్ల ‘ఖైదీ నంబర్ 150’పై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాల మధ్యనే సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిరుతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ముందుగా గుంటూర్‍లోని హాయ్‌ల్యాండ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి చెప్పండి?

స) నాకు అందిన సమాచారం ప్రకారం సుమారు 2 లక్షల మంది ఈ ఈవెంట్‌కు వచ్చారట. నాపై ఇంత అభిమానం కురిపిస్తోన్న అభిమానులకు ఎప్పటికీ ఋణపడి ఉంటా. సినిమాలకు దూరమైన నన్ను అదే రీతిలో ఆదరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

ప్రశ్న) ఈ తొమ్మిదేళ్ళూ సినీ పరిశ్రమను మిస్ అయినట్లు ఫీలయ్యారా?

స) నిజం చెప్పాలంటే నా చుట్టూ సినిమా వాతావరణమే ఉంటుంది కాబట్టి మిస్ అయినట్లు ఎప్పుడూ అనిపించలేదు. ఇక రాజకీయాలైనా, సినిమాలైనా ఫలితం మన చేతుల్లో ఉండదు. రాజకీయాల్లో రాణించలేకపోయినా అభిమానులంతా ఎప్పుడూ నా వెనకే నిలబడ్డారు. దీంతో ఏదో కోల్పోయాననే ఫీలింగ్ కూడా లేదు.

ప్రశ్న) మీ 150వ సినిమా కోసం చాలాకాలం కసరత్తులు చేశారెందుకని?

స) రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన రోజునుంచే వరుసగా కథలు వింటూ వచ్చా. అందులో కొన్ని బాగున్నా, నా కమ్‌బ్యాక్ సినిమా అంటే ఉండాల్సిన స్థాయిలో లేవు. దీంతో సరైన స్క్రిప్ట్‌ను ఎంచుకునేసరికి కాస్త ఆలస్యం అయింది.

ప్రశ్న) అన్ని కసరత్తులు చేసి రీమేక్‌ను ఎంచుకున్నారు ఎందుకని?

స) రీమేక్స్ చేయడం తప్పని నేననుకోను. విజయ్ నటించిన తమిళ సినిమా ‘కత్తి’ గురించి అప్పట్లో చాలా విన్నా. నేను ఆ సినిమా చూసిన వెంటనే, ఇది 150వ సినిమాగా బాగుంటుందని అనిపించి వెంటనే ఆ దిశగా అడుగులేశాం.

ప్రశ్న) ఒరిజినల్ వర్షన్‌కు ఏమేం మార్పులు చేశారు?

స) కత్తి ఒరిజినల్ చాలా సీరియస్‌గా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ‘ఖైదీ నంబర్ 150’ విషయానికి వస్తే నా ఇమేజ్‌కు తగ్గట్టు కామెడీ ఉండేలా చూసుకుంటూ, బ్రహ్మానందంతో పాటు కొన్ని ఇతర పాత్రలను కొత్తగా యాడ్ చేశాం.

ప్రశ్న) ప్రోమోస్‌లో చూస్తూంటే చాలా ఫిట్‍గా కనిపిస్తున్నారు. ఈ లుక్ కోసం ఎలా కష్టపడ్డారు?

స) నా కొత్త లుక్‍కు క్రెడిట్ అంతా రామ్ చరణ్‍కే దక్కాలి. నాకు పర్సనల్ ట్రైనర్‌లా మారి ఏం తినాలి, తినకూడదు అని ఒక పర్‌ఫెక్ట్ డైట్ చూసుకున్నాడు. ఎక్కువగా ప్రొటీన్ షేక్ తీసుకుంటూ డైట్ పాటించా.

ప్రశ్న) ఈ వయసులో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?

స) నిజం చెప్పాలంటే నాలో డ్యాన్స్ ఎప్పుడూ అలాగే ఉంది. తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ డ్యాన్స్ చేయాల్సి వచ్చినా బయట ప్రాక్టిస్ చేసింది లేదు. సెట్లో దేవిశ్రీ ప్రసాద్ బీట్ వినడం, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసింది చేయడం అన్నీ ఎప్పట్లానే జరిగిపోయాయి.

ప్రశ్న) సినిమాలో మీ సిగ్నేచర్ స్టెప్స్ కూడా ఉంటాయని వినిపిస్తోంది.?

స) అవును. రాఘవ లారెన్స్ వీణ స్టెప్‌కి ఎక్స్‌టెన్షన్ చేద్దామంటే ఈ సినిమాలో అది చేశాం. కచ్చితంగా అభిమానులకిది మంచి కిక్ ఇస్తుందని అనుకుంటున్నా.

ప్రశ్న) ఈమధ్యకాలంలో సోషల్ మీడియా బాగా విస్తరించింది. అందులో హీరోలను టార్గెట్ చేస్తూ కూడా కామెంట్స్ వస్తాయి. దీనిపై మీరేమంటారు?

స) సోషల్ మీడియా ఇప్పుడు అంతటా బాగా విస్తరించిన మాట వాస్తవమే! హీరోలను ట్రోల్ చేయడమైనా, కామెంట్ చేయడమైనా అంతా సాధారణంగా మారిపోయింది. ఇవి కాస్త ఓవర్ అయ్యాయని కూడా చూస్తే తెలుస్తోంది. నావరకూ నేను ఈ నెగటివ్ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోను. ఇలాంటి అనవసరమైన ట్రోల్స్ చేసేముందు ఎవ్వరైనా కాస్త ఆలోచించుకుంటే బాగుంటుంది.

ప్రశ్న) మీ తమ్ముడు నాగబాబు, రామ్ గోపాల్ వర్మల వివాదంపై మీరెలా స్పందిస్తారు?

స) నాకైతే ఒకప్పుడు గానీ, ఇప్పుడు గానీ రామ్ గోపాల్ వర్మతో ఎలాంటి విభేదాలు లేవు. ఇక నాగబాబు స్పీచ్ విషయానికి వస్తే, అది వ్యక్తిగత కోణంలోనే చూడాలి. నేనైతే ఎవరైనా కామెంట్ చేస్తే పెద్దగా పట్టించుకోను. నాగబాబు తన పాయింట్ ఆఫ్ వ్యూలో తాను ఎలా ఫీల్ అయింది చెప్పాడు. అది వ్యక్తిగత ఆలోచనగా చూసినప్పుడు ఆ స్పీచ్‌లోనూ తప్పు లేదు. ఇవన్నీ ఇలా ఉంచితే ఈ వివాదం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నా అభిమానులు కూడా దీన్ని సీరియస్‍గా తీసుకోరని అనుకుంటున్నా.

ప్రశ్న) ఈ సంక్రాంతికి వస్తోన్న మీ సినిమా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ల మధ్య పోటీని ఎలా చూస్తారు?

స) ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఉండేదే! వాటిని సీరియస్‌గా తీసుకోకుంటే బాగుంటుంది. నన్నడిగితే సంక్రాంతి సీజన్‌లో చాలా సినిమాలు ఒకేసారి వచ్చినా ఆడతాయని చాలాసార్లు ఋజువైంది. ఈ సంక్రాంతికి కూడా నా సినిమాతో పాటు, శాతకర్ణి కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా.

ప్రశ్న) హీరోల మధ్యన పోటీతత్వాన్ని మీరెలా చూస్తారు?

స) నేనసలు వీటిని పెద్దగా పట్టించుకోను. నా వరకూ నా సినిమా ఎలా వస్తుందన్నది వీటన్నింటికంటే ముఖ్యం. ఇకపోతే హీరోలు కూడా మేమంతా ఒక్కటే అన్న మెసేజ్ ఇవ్వాలి. మొన్నీమధ్యే చరణ్, మహేష్ కలిసి ఒక హాలిడే ట్రిప్‌కు వెళ్ళారు. ఈ ఒక్కటి చాలు హీరోలంతా ఎలా కలిసే ఉన్నారో చెప్పడానికి!

ప్రశ్న) రామ్ చరణ్ కెరీర్‌ ఎలా ఉందనుకుంటున్నారు?

స) ధృవ చూసిన తర్వాత సరైన కథలు ఎంచుకుంటున్నాడన్న నమ్మకం కలిగింది. నటనపరంగానూ ధృవలో చరణ్ నటన టాప్ క్లాస్ ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. చరణ్ సరైన దారిలోనే వెళుతున్నాడనుకుంటున్నా. అదేవిధంగా మెగాఫ్యామిలీ హీరోలంతా కూడా పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారు.

ప్రశ్న) మెగా ఫ్యామిలీ హీరోల మధ్యన పోటీని ఎలా చూస్తారు?

స) మెగా హీరోల మధ్యన పోటీ అనేదే ఉండదు. అందరూ సరైన దారిలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ తమ కెరీర్ నిర్మించుకుంటున్నారు.

ప్రశ్న) మీ వయసుకు సరిపడే పాత్రల్లో మిమ్మలు ఎప్పుడు చూడొచ్చు?

స) నా వయసనే కాదు, నాకంటే పెద్ద వయసైన పాత్రల్లో నటించడానికి కూడా నేను సిద్ధమే! అలాంటి పాత్రలు, మంచి కథలు వస్తే చేయడానికి వెనుకాడను.

ప్రశ్న) బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించిన దంగల్ తరహాలో ఏదైనా బయోపిక్‌లో మిమ్మల్ని చూడొచ్చా?

స) అదంతా స్క్రిప్ట్ డిసైడ్ చేయాలి. బయోపిక్స్ చేయడానికి నేను ఓకే కానీ, ఏ వ్యక్తి పాత్ర అయితే చేస్తానో, వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

ప్రశ్న) ఇక రాజకీయలకు గుడ్‌బై చెబుతారా?

స) లేదు. ప్రస్తుతానికి నేనున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి క్రియాశీలక కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదనే రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు.

ప్రశ్న)తదుపరి సినిమాలేంటి?

స) సురేందర్ రెడ్డితో, బోయపాటి శ్రీనుతో చర్చలు జరుగుతున్నాయి. ఖైదీ నంబర్ 150 విడుదలయ్యాక గానీ తదుపరి సినిమా ఏదనేది చెప్పలేను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు