ఇంటర్వ్యూ : హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీగా ఉంది !

22nd, June 2017 - 06:24:20 PM


దర్శకుడు హరీష్ శంకర్ బన్నీతో కలిసి చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం రేపే భారీ అంచనాల నడుమ విడుదలకానుంది. ఈ సందర్బంగా అయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) బన్నీని బ్రాహ్మణుడి పాత్రలో ఎందుకు చూపిస్తున్నారు ?
జ) మొదట బ్రాహ్మణులు అంత స్టైలిష్ గా ఉంటారని మనం అనుకోము. ఇక సమాజంలో జరిగే వివిధ రకాల ఘోరాలు చూసి విసుగెత్తిపోయేవాడిని, కానీ ఏమీ చేయలేకపోయేవాడ్ని. అందుకే ఒక బ్రాహ్మణ వంటవాడు తన జీవితంలో జరిగిన సంఘటనలకు ఎలా స్పందిస్తాడో చూపాలని బన్నీ పాత్ర రాశాను.

ప్ర) ఇందులో బన్నీ డబుల్ రోల్ లో చేస్తున్నాడా ?
జ) అది మాత్రం టాప్ సీక్రెట్. సినిమా చూసే అది తెల్సుకోవాలి. బన్నీ పాత్రను చాలా ఆసక్తికరంగా చూపించాం. సినిమాలో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే ఒక బ్రాహ్మణుడిగా ప్రదర్శించిన నటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్ర) ‘అస్మైక’ పాట వివాదం గురించి చెప్పండి ?
జ) కొంతమంది బ్రాహ్మణులకు ఆ పాటలోని లిరిక్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాను. కానీ వాళ్లలో కొందరు నా మాటలకు సంతృప్తి చెందలేదు. అందుకే వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ లిరిక్స్ మార్పించాం. ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఎవరూ కూడా ఎవర్నీ ఉద్దశ్యపూర్వకంగా భాధపెట్టరు.

ప్ర) క్లైమాక్స్ గురించి చాలా చెప్పారు. దాని గురించి ?
జ) హీరో వెళ్లి విలన్ తో ఒక ఫైట్ చేసి సినిమా ముగించేయడం అనే పద్దతికి భిన్నంగా ఇందులో క్లైమాక్స్ ఉంటుంది. అది కూడా చాలా ఎంటర్టైనింగా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాకి జెంటిల్మెన్, అదుర్స్ సినిమాలతో పోలికలేమన్నా ఉన్నాయా ?
జ) చాలా సినిమాలో హీరో పోలీసాఫీసర్ గా, ఎన్నారైగా కనిపిస్తాడు. అందుకని అలాంటి పాత్రలతో సినిమా తీయడం మానలేం కదా. ఇది కూడా అంతే. బ్రాహ్మణుల పాత్రలతో కొన్ని సినిమాలు మాత్రమే తీశారు. అందుకే అవి ఎక్కువగా గుర్తుండిపోతాయి. డీజే కూడా ఆ సినిమాలకి కొంచెం దగ్గరగా ఉంటూ ఎంటర్టైనింగా, ఎమోషనల్ గా సాగుతుంది.

ప్ర) డీజే పై వస్తున్న నెగెటివ్ పబ్లిసిటీ గురించి చెప్పండి ?
జ) సోషల్ మీడియా అనేది కత్తిలాంటిది. దానికి రెండు వైపులా పదునుంటుంది. ఒక వైపు నుండి వచ్చే పాజిటివ్ పబ్లిసిటీ సినిమాకు మంచి హైప్ తెస్తే మరో వైపు నుండి వచ్చే నెగెటివ్ పబ్లిసిటీ సినిమాను దెబ్బ తీస్తుంది. అందుకే యువకులు,యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాసే రాతలను తగ్గించుకోవాలి.

ప్ర) మీరు విమర్శలను ఎలా తీసుకుంటారు ?
జ) నేను విమర్శలను మామూలుగానే తీసుకుంటాను. నా సినిమాలు బాగా ఆడలేదని చెడుగా తీసుకోను. కానీ ఆ విమర్శ అనేది ఒక పద్దతిలో, సినిమా హద్దుల్లోనే ఉండాలి.

ప్ర) పవన్ కళ్యాణ్, చిరంజీవిలతో ఎప్పుడు వర్క్ చేస్తారు ?
జ) నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి 4 నెలలు కావోస్తోంది. ఆయన కోసం నా దగ్గర ఎప్పుడూ ఒక స్క్రిప్ట్ రెడీగానే ఉంటుంది. ఆయన ఒప్పుకుంటే ఎప్పుడైనా చెప్తాను. ఇక చిరంజీవిగారితో దొంగ మొగుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమా చేయాలనుంది. ఏదో ఒక రోజు తప్పకుండా చేస్తాను.