ఇంటర్వ్యూ : కాజల్ – చిరంజీవి గారి కోసమే ‘ఖైదీ నంబర్ 150’ చేశా!

kajal1
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు వసూళ్ళతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా అన్నిచోట్లా భారీ కలెక్షన్స్ సాధిస్తూ వెళుతోంది. ఇక ఈ సందర్భంగా ఖైదీలో హీరోయిన్‌గా నటించిన కాజల్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘ఖైదీ నంబర్ 150’కి వస్తోన్న రెస్పాన్స్ ఎలా ఉంది?

స) అద్భుతంగా ఉంది. చిరంజీవి సార్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్! ఇన్నేళ్ళ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక కూడా ఆయన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఖైదీకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది. కేవలం ఐదు రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్ళు వచ్చాయని తెలిసింది. ఇదంతా చిరు సార్ మ్యాజిక్!

ప్రశ్న) ‘ఖైదీ నంబర్ 150’లో అవకాశం రాగానే ఎలా ఫీలయ్యారు?

స) ‘ఖైదీ నంబర్ 150’ అవకాశం రాగానే నిమిషం ఆలోచించకుండా ఓకే చెప్పా. చిరంజీవి గారి ల్యాండ్ మార్క్ సినిమాలో భాగమవ్వడం కంటే కావాల్సింది ఏముంటుంది? నా మేనేజర్‌తో, ‘ఎలాగైనా ఈ సినిమాకు మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేయండి’ అని చెప్పా!

ప్రశ్న) చిరంజీవి గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది?

స) చిరంజీవి గారి యాక్టింగ్, డ్యాన్స్‌ చూస్తే నేను ఆయన పక్కన తేలిపోతానేమో అన్న భయమేసింది. ఈ వయసులోనూ ఆ గ్రేస్‌తో, ఆ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తూ ఈతరం హీరోలకు సవాల్ విసరడమంటే మామూలు విషయం కాదు. నేనైతే ఖైదీకి పనిచేసిన ప్రతిరోజునూ ఎంజాయ్ చేశా. యాక్టింగ్, డ్యాన్స్‌లో చిరంజీవి సార్ చాలా మెళకువలు నేర్పించారు.

ప్రశ్న) ఖైదీలో మీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని తెలిసినా ఓకే చెప్పారా?

స) నిజమే! ఖైదీ సబ్జెక్ట్‌లో ఉన్న రెండు బలమైన హీరో పాత్రల మధ్య హీరోయిన్‌ది చిన్న పాత్రే. ఈ విషయం తమిళ వర్షన్ ‘కత్తి’ చూసినప్పుడే నాకు తెలుసు. ఖైదీలోనూ ఆ రోల్ అలాగే ఉంటుందని కూడా తెలుసు. అయినప్పటికీ చిరంజీవి గారి ల్యాండ్‌మార్క్ సినిమాలో భాగమవ్వాలనే ఈ సినిమా చేశా. కొన్ని సినిమాలు పాత్రల కోసం చేస్తాం, కొన్ని వ్యక్తుల కోసం చేస్తాం. ఇది చిరంజీవి గారి కోసమే చేసిన సినిమా.

ప్రశ్న) రామ్ చరణ్‌‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా చేసిన సినిమాలో నటించారు. హీరోగా, నిర్మాతగా చరణ్‌లో తేడా ఉందా?

స) లేదు. హీరోగా ఎలా ఉన్నాడో, నిర్మాతగానూ అలాగే ప్రవర్తించేవాడు. చరణ్ నాకు ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్. తను నిర్మాతగా చేసిన మొదటి సినిమాయే ఇంత పెద్ద విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే నిర్మాతగా చరణ్ చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.

ప్రశ్న) ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మీ స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కదా.. మళ్ళీ స్పెషల్ సాంగ్ చేస్తారా?

స) ప్రస్తుతానికైతే లేదు. భవిష్యత్‌లో ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వస్తే, అది నిజంగానే స్పెషల్ అనే స్థాయిలో ఉంటే చేస్తా!

ప్రశ్న) తదుపరి సినిమాలేంటి? పెళ్ళి గురించి కూడా వార్తలొస్తున్నాయి?

స) ప్రస్తుతానికి వరుసగా సినిమాలు చేస్తున్నా. పెళ్ళి గురించైతే ఇంకా ఆలోచించలేదు. రానా-తేజల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో నటిస్తున్నా. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ గారితో పదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నా. తమిళంలో అజిత్, విజయ్‌ల సినిమాలు చేస్తున్నా.